బిగ్‌బాస్ తెలుగు( Big Boss Telugu) రియాలిటీ షో ఆరో సీజన్ ఓటీటీ స్ట్రీమింగ్ కు సర్వం సిద్ధం అయిన సందర్భంగా క్రేజీ బజ్ వినిపిస్తోంది. బిగ్ బాస్ థర్డ్ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. కానీ ఈ సీజన్ కు న్యూ హోస్ట్ గా యాంకర్ రవి పేరు గట్టిగా వినిపిస్తోంది.
‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ ఆరో సీజన్ కోసం టీవీ ఆడియెన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు. ఈ సారి హౌజ్ లుక్ కూడా చాలా గ్రాండ్ గా కనిపించనుంది. గతంతో పోల్చుకుంటే మరిన్ని సౌకర్యాలతో హౌజ్ ముస్తాబైంది. ఇప్పటికే ఫైనల్ లిస్ట్ జాబితా నెట్టింట చక్కర్లు కొడుతుండగా ఈ నెల 26 నుంచి షో స్ట్రీమింగ్ షురూ కానుంది. బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రపంచ వ్యాప్తంగా విజయవంతమైన షో. ఇండియాలోనూ విశేష ఆదరణ పొందుతుంది. ఇక తెలుగులో ఇప్పటి వరకు ఐదో షోలు విజయవంతంగా పూర్తయ్యాయి. గతేడాది డిసెంబర్‌లో ఐదో సీజన్ పూర్తికాగా, వీజే సన్నీ విన్నర్‌గా నిలిచారు.
ఇక ఆరో సీజన్ కూడా త్వరగానే ప్రారంభమవుతుందని నాగార్జున (Nagarjuna) గ్రాండ్ ఫినాలే రోజునే చెప్పారు. చెప్పినట్టుగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ ఫైనల్ లిస్ట్ జాబితా కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. మొత్తం 19 మంది కాంటెస్టెంట్ల పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు గత ఐదు సీజన్ల నుంచి ఇద్దరిని చొప్పున ఈ ఆరో సీజన్‌కి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీంతో పది మంది కంటెస్టెంట్లు పాతవారే ఉండబోతున్నారు. అరియానా, ముమైత్ ఖాన్, ఆషురెడ్డి, అఖిల్, హమీద, సరయు, ధన్‌రాజ్, తనీష్, మహేష్‌విట్టా, ఆదర్శ్, నటరాజ్ మాస్టర్ గత సీజన్లలో పాల్గొన్న వారే కావడం విశేషం. ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’(Big Boss Non Stop) పేరుతో ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’ (Disney Plus Hotstar)లో ఈ నెల 26నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది.
అయితే.. ఈ షోకు ఇప్పటి వరకు యంగ్ టైగర్ ఎన్టీ ఆర్ (NTR), న్యాచురల్ స్టార్ నాని (Nani), కింగ్ నాగార్జున ( Nagarjuna) వ్యవహరించారు. 2017లో ప్రారంభమైన ఈ రియాలిటీ షో మొదటి షోకు ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్నారు. ఆ తర్వాత నాని రెండో సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించారు. ఆ తర్వాత కింగ్ నాగార్జున మూడో సీజన్ నుంచి హోస్ట్ గా ఉంటున్నారు. గెస్ట్ హోస్ట్ గా రమ్యక్రిష్ణ, సమంత (Samantha) మూడు, నాలుగు సీజన్లలో కనిపించారు. అయితే ఆరో సీజన్ ఓటీటీ వేదికన ప్రసారం కానుంది. ఈ క్రమంలో హోస్ట్ గా నాగార్జున తప్పుకుంటున్నట్టు నెట్టింట ప్రచారం జరుగుతోంది.
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ న్యూ హోస్ట్ గా యాంకర్ రవి (Anchor Ravi) పేరు నెట్టింట గట్టిగా వినిపిస్తోంది. అయితే శ్రీరామచంద్ర, యాంకర్ రవి పేర్లను బిగ్ బాస్ పరశీలించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీరామ చంద్ర ఆహాలో ప్రసారం కానున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సింగింగ్ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఇక యాంకర్ రవినే సెలెక్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే లాంచింగ్ రోజునైనా నాగార్జున వస్తారా లేక... మొదటి వారం ఆయనే హోస్ట్ గా ఉండి తర్వాత యాంకర్ రవికి ఆ తర్వాత బాధ్యతలు అప్పగిస్తారా అన్నది వేచి చూడాలి. తమిళంలో కొనసాగుతున్న బిగ్ బాస్ (Big Boss Tamil) కు హోస్ట్ గా వ్యవహరించిన కమల హాసన్ (Kamala Haasan) ఓటీటీ వేదికన ప్రసారమవుతున్న షోకు తప్పుకున్నారు. అటు హిందీ ఓటీటీలోనూ కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
