`జబర్దస్త్` యాంకర్‌, హాట్‌ బ్యూటీ అనసూయ మరో బంపర్‌ ఆఫర్‌ కొట్టేసింది. మాస్‌ మహారాజా రవితేజతో కలిసి నటించే ఛాన్స్‌ ని కొట్టేసింది. `ఖిలాడి`ని పట్టేసింది. రవితేజ హీరోగా రూపొందుతున్న `ఖిలాడి` చిత్రంలో కీలక పాత్ర కోసం ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం బుధవారం వెల్లడించింది. `వెల్‌కమ్‌ బ్యూటీఫుల్‌ నటి అనసూయ భరద్వాజ్‌ ఆన్‌ బోర్డ్. ప్లే స్మార్ట్, ఈ లేడీ గేమ్‌ ఛేంజర్‌` అని పేర్కొన్నారు. 

ఈ లెక్కన ఇందులో అనసూయ బలమైన పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది. రమేష్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దింపుల్‌ హయతి హీరోయిన్‌గా నటిస్తున్నట్టు, నిధి అగర్వాల్‌ మరో హీరోయిన్‌గా నటిస్తారని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ ఆకట్టుకుంది. ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఏ స్టూడియో ఎల్‌ఎల్‌పీ, పెన్‌ మూవీస్‌ పతాకాలపై కోనేరు సత్యానారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఇదిలా ఉంటే అనసూయ ఇప్పుడు సినిమాల్లో ఫుల్‌ బిజీ అవుతుంది. ప్రస్తుతం ఆమె `ఆచార్య`, `పుష్ప`, `రంగమార్తాండ`తోపాటు తమిళంలో విజయ్‌ సేతుపతి చిత్రంలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే పవన్‌ కళ్యాణ్‌, క్రిష్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలోనూ కీలక పాత్ర కోసం ఎంపికైందని టాక్‌. ఇప్పుడు ఈ రవితేజ చిత్రంలోనూ ఛాన్స్‌ కొట్టేసింది. అలాగే మెయిన్‌ లీడ్‌గా `థ్యాంక్యూ బ్రదర్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.