యాంకర్‌ అనసూయకి కరోనా సోకినట్టు తెలుస్తుంది. తనకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయట. దీంతో తన ప్రయాణాన్ని కూడా వాయిదా వేసుకున్నట్టు, తనని ఇటీవల కలిసిన వారంతా టెస్ట్ చేయించుకోండని తెలిపింది అనసూయ. ఆదివారం ఉదయం ఆమె ట్వీట్‌ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. 

`హలో ఎవ్రీవన్‌.. ఈ రోజు ఉదయాన్నే కర్నూల్‌ వెళ్లేందుకు త్వరగా లేచాను. కానీ నాలో కొన్ని కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే నా షెడ్యూల్‌ని రద్దు చేసుకున్నా. నా కరోనా టెస్ట్ రిజల్ట్ గురించి మీకు తెలియజేస్తాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా ఓ సారి టెస్ట్ చేయించుకోండి. ప్రతి ఒక్కరు సేఫ్‌గా ఉండండి` అని అనసూయ ట్వీట్‌ చేసింది. 

అనసూయ ప్రస్తుతం `జబర్దస్త్` షోలో పాల్గొంటుంది. మరోవైపు స్పెషల్‌ ఈవెంట్లు చేస్తుంది. దీంతోపాటు రెండు రోజుల క్రితమే `రాయుడు చిత్రాలు` ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ వెబ్‌ సిరీస్‌ ఓపెనింగ్‌ కార్యక్రమంలో పాల్గొంది. ఈ కార్యక్రమంలో కొత్త పెళ్లి జంట నిహారిక, చైతన్య, అలాగే మాస్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, స్టార్‌ రైటర్‌, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ సైతం పాల్గొన్నారు. 

అనసూయ ట్వీట్‌తో వారిలో ఆందోళన నెలకొంది. అయితే పూజా కార్యక్రమంలో వీరంతా మాస్క్ లు లేకుండానే కనిపించారు. సేఫ్‌గా ఉండాలని ప్రజలకు నీతులు చెప్పే వీరంతా మాస్క్ లు పక్కన పెట్టి ఇలా కలివిడిగా తిరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల మెగా ఫ్యామిలీలో కరోనా వచ్చింది. రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌, ఉపాసన తమకి కరోనా పాజిటివ్‌ వచ్చిందని ప్రకటించారు. తమ ఫ్యామిలీలోనే కరోనా సోకినా, కొత్త జంట నిహారిక, చైతన్య ఇలా బయటకు రావడం, పైగా మాస్క్ లు దరించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మరి అనసూయకి నిజంగానే కరోనా సోకిందా? రిజల్ట్ లో ఏం తేలుతుందనేది చూడాలి.