2020 ప్రపంచం ఎన్నడూ చూడని దుర్భర పరిస్థితులను పరిచయం చేసింది. కరోనా వైరస్ అనే మహమ్మారి ప్రపంచాన్ని స్థంబింపజేసింది. మనిషిని మనిషికి దూరం చేసిన ఈ వ్యాధి, లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది. ఆకలి చావుల నుండి ఆర్థిక భారాల ఆత్మహత్యల వరకు అనేక దారుణాలకు కారణం అయ్యింది. ఇప్పటికీ కరోనాకు పరిష్కారం ప్రపంచం కనిపెట్టలేకపోయింది. 

ఇది చాలదన్నట్లు తాజాగా వరదలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా మూసి పొంగి హైదరాబాద్ సంద్రంగా మారిపోయింది. రోడ్లు కాలువలుగా మారిపోగా అనేక మంది మృత్యువాత పడ్డారు. కరెంట్, నీరు,తిండి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. చిన్నపిల్లలపై కూడా ఈ వైపరీత్యాలు ప్రభావం చూపుతున్నాయని...అనసూయ చెప్పిన సంఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చు. 

అనసూయ 9 ఏళ్ల కొడుకు ఆమెతో తనకు 2017, 18 సంవత్సరాలకు తిరిగి వెళ్లిపోవాలని ఉందని అన్నాడట. అప్పుడు కరోనా లేదు, వరదలు లేవు...హ్యాపీ లైఫ్ గడిపాము అన్నాడట. దానికి అనసూయకు ఏడుపొచ్చేసిందట. వాతావరణంలో మార్పుల కారణంగా అనేక విపత్తులు సంభవిస్తూ ఉండగా, మన పిల్లలు, రాబోయే తరాల పరిస్థితి ఏమిటని ఒక నిస్సహాయత ఆమె వ్యక్తం చేశారు. హైదరాబాద్ వరదలకు కారణంగా కూడా అభివృద్ధి పేరుతో మనుషులు చేసిన ప్రకృతి వినాశనమే.