అందాల యాంకర్ అనసూయకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా సత్తా చాటుతోంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రలో అనసూయ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిత్రం తర్వాత అనసూయకు నటిగా అవకాశాలు పెరుగుతున్నాయి. 

తాజాగా అనసూయ నటించిన చిత్రం 'కథనం'. రాజేష్ నాదెండ్ల ఈ చిత్రానికి దర్శకుడు. ఆసక్తికర కథాంశంతో ఈ శుక్రవారం అంటే ఆగష్టు 9న కథనం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అనసూయ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఓ ఇంటర్వ్యూలో అనసూయ కథనం చిత్రం గురించి, భవిష్యత్తులో తాను చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి వివరించింది. 

ఈ చిత్రంలో తాను అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రలో కనిపించబోతున్నట్లు అనసూయ తెలిపింది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో కథ చాలా ఆసక్తికరంగా ఉంటుందని అనసూయ తెలిపింది. 

అనసూయకు కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొనే అవకాశం వచ్చిందట. కానీ ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు అనసూయ ప్రకటించింది. నా కుటుంబ సభ్యులని విడచి ఒక్క రోజు కూడా ఉండలేను. అందుకే బిగ్ బాస్ షోకు వెళ్ళలేదు అని అనసూయ తెలిపింది. 

రంగస్థలం చిత్రం తర్వాత తనకు చాలా అవకాశాలు వచ్చాయని అనసూయ పేర్కొంది. రంగస్థలం తర్వాత దాదాపు 13 కథలు విన్నా. చివరకు 'కథనం' కథ నచ్చడంతో ఓకె చేశానని అనసూయ తెలిపింది. 

ఇక కథనం చిత్రం మన్మథుడు 2కి పోటీగా వస్తుండడంపై అనసూయ స్పందించింది. నాగార్జున గారితో నాకు పోటీ ఏంటి. మాది చిన్న సినిమా.. థియేటర్స్ దొరకడమే కష్టం. రిలీజ్ డేట్ ఇది కుదిరింది.. అందుకే విడుదల చేస్తున్నాం అని అనసూయ తెలిపింది.