ఆ మధ్య మంగమ్మ శపథం తరహాలో ఇక సోషల్ మీడియాలోకి రాను గాక రాను అంటూ సెలవు తీసుకుని వెళ్ళిపోయిన మంగమ్మత్త అలియాస్ అనసూయ ఎట్టకేలకు రంగస్థలం చిట్టి బాబు పుణ్యమా అని చాలా త్వరగానే రీ ఎంట్రీ ఇచ్చేసింది. ట్విట్టర్ ఫేస్ బుక్ ఇన్స్ టాగ్రామ్ లో సదా యాక్టివ్ గా ఉండే అనసూయ కొన్ని వారాల క్రితం ఒక తల్లికొడుకు సెల్ ఫోన్ నేలకేసి పగలగొట్టిన ఇష్యూ లో బాగా హై లైట్ అయ్యాక అలకబూని సోషల్ మీడియా నుంచి వెళ్లిపోయింది. ఇక అప్పటి నుంచి తన జాడ ఎక్కడా కనిపించలేదు. ఫాన్స్ కొంత కాలం ఎదురు చూసి టీవీ షోస్ లో మాత్రమే తనను చూసుకుని సర్దుకోవడం మొదలుపెట్టారు. తాను అలక చెందితే తనకు తప్ప ఇంకెవరికి ఎటువంటి నష్టం లేదని గుర్తించిన అనసూయ సరైన టైంలోనే వెనక్కు వచ్చేసింది.

రంగస్థలంలో తన లుక్ ని రివీల్ చేస్తూ రీ ఎంట్రీని స్పెషల్ గా సెలెబ్రేట్ చేసుకుంది. రామ్ చరణ్ ని అల్లుడు అని పిలిచే పాత్ర చేయడానికి తొలుత తాను ఇష్టపడలేదని కాని చెర్రి-సుక్కు పదే పదే తన వెంట పడి కథ చెప్పి ఒప్పించేంత వరకు వద్దల్లేదని చెప్పిన అనసూయ ఇందులో నిజంగానే చాలా కొత్తగా కనిపిస్తోంది. అచ్చమైన పల్లెటూరి గెటప్ లో డీ గ్లామర్ లో ఇంతకు ముందు చూడని అనసూయను సుకుమార్ నిజంగానే ఇందులో చూపించబోతున్నాడు. కథకు తాను ఏ విధంగా లింక్ అయ్యుంటుంది అనే విషయాలు బయట పెట్టలేదు కాని కీలకంగా అనిపించే పాత్రనే సుకుమార్ సెట్ చేసినట్టు స్పష్టమైంది.

క్షణంలో విలన్ గా చేసాక అంత కన్నా ఎక్కువ పేరు తెచ్చే పాత్ర ఇదేనని అనసూయ నమ్మకంగా ఉంది. సో తను వచ్చేసింది కాబట్టి రంగస్థలం అప్ డేట్స్ తో పాటుగా జబర్దస్త్ షోలలో తాను వేసుకోబోయే కాస్ట్యూమ్స్ తో కూడిన స్పెషల్ స్టిల్స్ కూడా ఇకపై అనసూయ ఎకౌంటులో ఎంచక్కా చూసుకోవచ్చు. ఇంతకీ ఆ సెల్ ఫోన్ గొడవ క్లైమాక్స్ ఎలా చేరింది అనే ప్రశ్నకు అనసూయే సమాధానం చెప్పాలి.