బిగ్‌బాస్‌4, 53వ రోజు షోలో కిక్‌ తగ్గింది. గతంలో కెప్టెన్సీ టాస్క్ రెండు మూడు రోజులు పెట్టేవారు. ఓ పెద్ద పెద్ద టాస్క్ లు పెట్టి నానా హంగామా జరిగేది. కానీ ఈ వారం సింపుల్‌గా తేల్చేశారు. చూస్తుండగానే అరియానా కెప్టెన్‌గా గెలుపొందారు. గతవారం కెప్టెన్సీ కోసం చివరి వరకు వచ్చిన ఆమె ఈ సారి ఊహించని విధంగా కెప్టెన్సీ టాస్క్ ని గెలుపొందారు. 

మరోవైపు నోయల్‌ అనారోగ్య పరిస్థితి హౌజ్‌లో అందరిని కలచివేసింది. ఆయన్ని బెటర్‌ ట్రీట్‌మెంట్‌ కోసం బయటకు తీసుకెళ్లారు. ఇక ఇప్పుడు నామినేషన్‌కి సంబంధించిన టెన్షన్‌ ఇంటిసభ్యుల్లో నెలకొంది. ఈవారం ఎలిమినేషన్‌కి అమ్మా రాజశేఖర్‌, అఖిల్‌, మోనాల్, మెహబూబ్‌, అరియానా, లాస్య ఎంపికయ్యారు. 

ప్రస్తుతం ఎనిమిదో వారం కొనసాగుతుంది. ఇంట్లో 11 మంది ఉన్నారు. ఈ లెక్కన ఒక్కొక్క ఎలిమినేషన్‌ ఉంటే లెక్క కుదిరేలా లేదు. దీంతో ఈ వారం ఇద్దరిని ఇంటి నుంచి పంపించేందుకు బిగ్‌బాస్‌ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. గతంలో ఈ వారం ఇద్దరు ఎలిమినేషన్‌ ఉంటుందని చెప్పి చిన్న ట్విస్ట్ లతో ఆ ప్రక్రియని ఆపేశారు. కానీ ఈ వారం మాత్రం ఇద్దరిని ఎలిమినేట్‌ చేయాలని భావిస్తున్నారట. 

ఇక ఎలిమినేషన్‌ విషయానికి వస్తే ఈ వారం అమ్మా రాజశేఖర్‌, మెహబూబ్‌, మోనాల్‌ మధ్య ఎలిమినేషన్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌లా ఉండబోతుందని తెలుస్తుంది. అఖిల్‌ కోసం మోనాల్‌ని సేవ్‌ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. దీంతో ఇక మిగిలిన అమ్మా రాజశేఖర్‌, మెహబూబ్‌ ఈవారం ఇంటి నుంచి వెళ్లే ఛాన్స్ ఉందని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఊహించినట్టే ఇద్దరు ఎలిమినేట్‌ అవుతారా? లేక ఒక్కరినే ఎలిమినేట్‌ చేస్తారా? సమంత ఏం చేయబోతుందనేది చూడాలి.