బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌కి రెండోసారి కంటి ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయ్యింది. ఆయన ఇటీవల ఆసుపత్రిలో చేరుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బిగ్‌బీకి ఏమైందో అని అభిమానులు ఆందోళన చెందారు. అయితే తాజాగా అమితాబ్‌ తన ఆరోగ్య పరిస్థితిపై ట్వీట్‌ చేశారు. రెండో సారి కంటి ఆపరేషన్‌ సక్సెస్‌ అయినట్టు వెల్లడించారు. తనకు లేజర్‌ చికిత్స జరిగినట్టు అమితాబ్‌ వెల్లడించారు. ఇది వరకు ఓ కంటిలో శుక్లానికి సంబంధించి లేజర్‌ ట్రీట్‌మెంట్‌ జరిగింది. ఇప్పుడు మరో కంటికి కూడా చికిత్స పూర్తయ్యిందని చెప్పారు.  

ఈ సందర్భంగా తనకు ఆపరేషన్‌ చేసిన హిమాన్షు మెహతాకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. `లైఫ్‌లో ఇదొక ఛాలెంజింగ్‌ విషయమని, త్వరలోనే తాను కోలుకుని షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు చెప్పారు. గత కొన్ని రోజులుగా అమితాబ్‌ కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి చాలా రకాల ట్రీట్‌మెంట్లు తీసుకున్నా ప్రయోజనం లేదు. దీంతో లేజర్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం అమితాబ్‌ బచ్చన్‌ `మేడే`, `జుండ్‌`, తెలుగులో ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో రూపొందబోతున్న చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు వికాస్‌ బల్‌ చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారట.