మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 2న సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడంతో చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆదివారం నాడు భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఇక గ్రూప్ ఇంటర్వ్యూలు, సోలో ఇంటర్వ్యూలు 
ఎలానూ ఉంటాయి.

అక్టోబర్ 2లోపు వీలైనంతగా సినిమాను ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. దానికి తగ్గట్లే సినిమాలో ఆయా భాషలకు చెందిన పేరున్న నటీనటులను తీసుకున్నారు. హైదరాబాద్ లోనే కాకుండా చెన్నై, బెంగుళూరు, కొచ్చిలలో కూడా ఈవెంట్స్ ప్లాన్ చేశారు. అయితే బాలీవుడ్ లో సినిమా ప్రమోషన్స్ కోసం 'సైరా' టీమ్ బిగ్ బీని నమ్ముకుంది.

ఈ బాలీవుడ్ మెగాస్టార్ సినిమాలో చిరంజీవికి గురువు పాత్రలో కనిపించనున్నారు. బిగ్ బీ లాంటి నటులు ఉండడంతో బాలీవుడ్ లో ప్రమోషన్స్ బాగా చేయొచ్చని భావించారు. కానీ ఇప్పుడు అమితాబ్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. బిగ్ బీ ఆరోగ్యం సరిగా లేదని.. అందుకే ఆయన ప్రచార కార్యక్రమాలకు హాజరవ్వడం లేదని 'సైరా' టీమ్ చెబుతున్నా.. ప్రమోషన్స్ కి రాను అని అమితాబ్ ముందే చిత్రబృందానికి చెప్పినట్లు టాక్.

ఇక న‌య‌న‌తార సంగ‌తి స‌రేస‌రి. త‌ను ప్ర‌మోష‌న్ల‌కు దూరంగా ఉంటుంది. 'సైరా' కైనా ఆమెను తీసుకురావాల‌ని చిత్ర‌బృందం భావించింది. అయితే ఇప్పుడు న‌య‌న‌తార కూడా అందుబాటులో లేకుండా పోయింది.ఇప్పుడు ఈ ఇద్దరు తారలు లేకుండానే ప్రమోషన్స్ మొదలుకానున్నాయి.