కరోనాతో పోరాడి బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ విజయం సాధించారు. రెండు రోజుల క్రితమే ఆయన వైరస్‌ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో దాదాపు ఇరవై రోజులకుపైగా చికిత్స పొంది సురక్షితంగా బయటపడ్డారు. ఇదిలా ఉంటే అభిషేక్‌ బచ్చన్‌ ఇంకా వైరస్‌తో పోరాడుతుండటం బాధాకరం. 

 77ఏళ్ళ అమితాబ్‌ వైరస్‌ని జయించగా, 43ఏళ్ల అభిషేక్‌ ఇంకా మహమ్మారితో స్ట్రగుల్‌ అవడం ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే ఐశ్వర్యా రాయ్‌, వారి కూతురు ఆరాధ్య కూడా వైరస్‌ నుంచి సురక్షితంగా బయటపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిషేక్‌ ఇంకా ట్రీట్‌ మెంట్‌ తీసుకుంటూనే ఉన్నారు. ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. 

దీనిపై అమితాబ్‌ ఆందోళన చెందుతున్నారు. వైరస్‌ నుంచి తాను కోలుకున్నందుకు ఆనందంగా ఉందనీ, కానీ అభిషేక్‌ ఇంకా ఆసుపత్రిలోనే ఉండటం ఆందోళన కలిగిస్తుందన్నారు. `కరోనా వైరస్‌ నుంచి కోలుకుని ఇంటికి తిరిగి రావడం ఆనందంగా ఉంది. కానీ చిన్న అసంతృప్తి మాత్రం వెంటాడుతుంది. అభిషేక్‌ ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉండిపోవడం చాలా బాధగా ఉంది` అని సోషల్‌ మీడియాలో వెల్లడించారు. అమితాబ్‌ ట్వీట్‌తో ఆయన అభిమానులు మరింత ఆందోళన చెందుతున్నారు. అభిషేక్‌ కూడా సురక్షితంగా బయటపడతారని ధైర్యం చెబుతున్నారు. 

అభిషేక్‌ నటించిన వెబ్‌ సిరీస్‌ `బ్రీత్‌ః ఇన్‌టూ ది షాడోస్‌` ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన `లుడో`, `ది బిగ్‌ బుల్‌`, `బాబ్‌ బిస్వాస్‌` చిత్రాల్లో నటిస్తున్నారు.