అల్లు శిరీష్‌ సిక్స్ ప్యాక్‌లో అదరగొడుతున్నారు. కరోనా వల్ల ఏర్పడిన గ్యాప్‌ని ఇలా జిమ్‌లో వర్కౌట్స్ తో బిజీగా గడుపుతూ ఫిట్‌నెస్‌ పెంచుకుంటున్నాడు. ఫిట్‌నెస్‌ మాత్రమే కాదు సిక్స్ ప్యాక్‌తోనూ ఔరా అనిపించుకుంటున్నారు. తాజాగా ఆయన పంచుకున్న జిమ్‌లో సిక్స్ ప్యాక్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్‌ అవుతున్నాయి. క్రమం తప్పకుండా వర్కౌట్‌ చేస్తూ, మంచి డైట్‌ మెయింటేన్‌ చేస్తూ తన బాడీని ట్రాన్న్ఫర్మేషన్‌ చేసుకున్న తీరుకి అభిమానులు ఫిదా అవుతున్నారు. 

అల్లు అరవింద్‌ లాంటి మెగా ప్రొడ్యూసర్‌ తనయుడైనా, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తమ్ముడైనా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేందుకు తపిస్తున్నారు. ఈ క్రమంలో తనని తాను మంచి నటుడిగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. `గౌరవం` సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు శిరీష్. `శ్రీరస్తు శుభమస్తు`, `ఒక్క క్షణం` వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. కమర్షియల్ సినిమాల కంటే కూడా కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల వైపు పరుగులు తీస్తున్నాడు శిరీష్. `ఎబిసిడి` హిందీ డబ్బింగ్ సినిమాతో ఉత్తరాదిన కూడా క్రేజ్ ఏర్పరచుకున్నాడు. 

ఈ క్రమంలో ఇటీవల `విలాయటి శరాబ్` అనే హిందీ మ్యూజిక్ ఆల్బమ్ తో 100 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి సత్తా చాటాడు. `ఎబిసిడి` తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న శిరీష్.. ఇప్పుడు కొత్త సినిమాతో వస్తున్నాడు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుల్ హీరోయిన్ గా నటిస్తోంది. మే 30న అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.