మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన రాంచరణ్, బన్నీ, వరుణ్, తేజు లాంటి యంగ్ జనరేషన్ హీరోలు టాలీవుడ్ లో తమదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నారు. అల్లు శిరీష్ ఆ దిశగా ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు చేస్తున్నారు. శిరీష్ నటించిన తాజా చిత్రం ఎబిసిడి. మలయాళీ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.   

మహర్షి లాంటి భారీ చిత్రం బరిలో ఉన్నప్పటికీ ఎబిసిడి నిర్మాతలు కంటెంట్ పై నమ్మకంతో ఎబిసిడి చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు అల్లు శిరీష్ కెరీర్ లో పరవాలేదనిపించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు మాత్రమే. ఎబిసిడి టీజర్, ట్రైలర్స్ ఆడియన్స్ ని బాగా ఆకర్షించాయి. అల్లు శిరీష్, భరత్ చేస్తున్న కామెడీ సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పింది. ఎబిసిడి విడుదలవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. 

ఫస్ట్ హాఫ్ బావుందని కొందరు ట్వీట్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ పరవాలేదనిపించే విధంగా ఉందట. మరి కొందరు మాత్రం ఎబిసిడి ఒరిజినల్ వర్షన్ స్థాయిలో లేదని తీవ్రంగా నిరాశపరిచే చిత్రం అని అంటున్నారు. మరికొందరు ఈ చిత్రంలో భరత్ పాత్ర హైలైట్ గా నిలిచిందని, కొన్ని కామెడీ సీన్స్ బావున్నాయని అంటున్నారు. స్క్రీన్ ప్లే స్లోగా సాగుతుందట. 

ఫస్ట్ హాఫ్ లో దర్శకుడు అసలు కథలోకే వెళ్లలేదని, కొన్ని సన్నివేశాలు చూస్తున్నపుడు నిద్ర వచ్చే విధంగా ఉన్నాయని ట్వీట్ చేస్తున్నారు. ఎబిసిడి చిత్రం రాజీవ్ రెడ్డి దర్శకత్వంలో, మధుర శ్రీధర్ నిర్మాణంలో తెరకెక్కింది. రుక్సార్ థిల్లోన్ హీరోయిన్. మెగా బ్రదర్ నాగబాబు శిరీష్ తండ్రి పాత్రలో నటించారు.