అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రం ఎబిసిడి. మళయాలంలో దుల్కర్ సల్మాన్ నటించిన ఈ చిత్రం 2012లో విడుదలై విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి తెలుగు రీమేక్ గా అదే టైటిల్ తో తెరకెక్కించారు. రాజీవ్ రెడ్డి దర్శకుడు. మధుర శ్రీధర్ ఈ చిత్రానికి నిర్మాత. యంగ్ బ్యూటీ రుక్సార్ థిల్లోన్ హీరోయిన్ గా నటించింది. నేడు(శుక్రవారం మే 17) ఈ చిత్రం విడుదల కానుండడంతో అల్లు శిరీష్ హిట్టు కొడతాడా లేదా అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. 

యూఎస్ ప్రీమియర్ షోలు ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో ఎబిసిడి చిత్రానికి ఎలాంటి టాక్ వస్తుందో చూద్దాం. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన ధనవంతుడిగా అల్లు శిరీష్ నటించాడు. హీరోకి ఎలాంటి డబ్బు అందకుండా అతడి తండ్రి చేస్తాడు. ఈ నేపథ్యంలో శిరీష్, అతడి స్నేహితుడు భరత్ ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది ఈ చిత్ర కథ. ఫస్ట్ హాఫ్ లో మొత్తం వినోదంగానే సాగుతుందని ఆడియన్స్ అంటున్నారు. కామెడీ స్థాయి ఇంకాస్త పెంచాల్సిందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. 

సెకండ్ హాఫ్ లో దర్శకుడు ఎక్కువగా కథకే ప్రాధాన్యత ఇచ్చాడు. దీనితో ఎంటర్టైనింగ్ అంశాలు తగ్గాయి. కథలో దర్శకుడు సిద్ధం చేసుకున్న కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అంతగా వర్కౌట్ కాలేదనే టాక్ వినిపిస్తోంది. పాటలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అల్లు శిరీష్ నటన ఆకట్టుకుందని అంటున్నారు. భరత్, వెన్నెల కిషోర్ తమ పాత్రలకు తగ్గట్లుగా హాస్యాన్ని పండించారు. వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో టీవీ యాంకర్ గా కనిపిస్తాడు. హీరోయిన్ రుక్సార్ థిల్లోన్ కు చిత్రంలో తక్కువ ప్రాధాన్యత మాత్రమే ఉంది. 

ఈ చిత్రంలో విలన్ గా నటించిన సిరివెన్నెల రాజా పాత్ర అంతగా ఆకట్టుకోలేకపోయింది టాక్. ఓవరాల్ గా అల్లు శిరీష్ ఎబిసిడి చిత్రంతో ఒక మంచి ప్రయత్నమే చేశాడు. కానీ సెకండ్ హాఫ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సమ్మర్ హాలిడేస్ ఉండడం కమర్షియల్ గా ఎబిసిడి చిత్రానికి కలసి వచ్చే అంశం అయితే మహర్షి చిత్రంతో పోటీ పడుతుండడం.. మరికొన్ని చిత్రాలు విడుదల కానుండడం ప్రతికూల అంశాలు. ఎబిసిడి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏస్థాయిలో వసూళ్లు రాబడుతుందో వేచి చూడాలి.