అల్లు శిరీష్ నటించిన ఎబిసిడి చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశి అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో ఇండియా టూర్ వచ్చిన ఎన్నారై యువకుడిగా శిరీష్ నటించాడు. అతడి స్నేహితుడి పాత్రలో భరత్ నటించడం విశేషం. రాజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ నిర్మించారు. రుక్సార్ థిల్లోన్ హీరోయిన్.  

మలయాళీ చిత్రం ఎబిసిడికి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్, టీజర్స్ తో ఆకర్షించింది. శిరీష్ తొలిసారి కామెడీతో ఆకట్టుకోబోతున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థం అయింది. కానీ తొలి షో నుంచే ఎబిసిడి చిత్రానికి డివైడ్ టాక్ మొదలైంది. అల్లు శిరీష్, భరత్, వెన్నెల కిషోర్ కామెడీతో కొంతమేరకు ఆకట్టుకున్నారు. కథ పరంగా ఈ చిత్రం నిరాశపరిచిందనే టాక్ వినిపించింది. ఫిలిం క్రిటిక్స్ నుంచి కూడా మిశ్రమ స్పందన లభించింది. 

టాక్ ఎలా ఉన్నా తొలి రోజు మాత్రం ఎబిసిడి చిత్రానికి పర్వాలేదనిపించే వసూళ్లు నమోదయ్యాయి. ఎబిసిడి చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.25 కోట్ల షేర్ రాబట్టింది. మహర్షి చిత్ర పోటీని తట్టుకుని శిరీష్ నటించిన చిత్రం ఈ మాత్రం వసూళ్లు రాబట్టడం విశేషమే. ఎబిసిడి చిత్రానికి 7 కోట్ల వరకు థియేట్రికల్ ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. డివైడ్ టాక్ నేపథ్యంలో రాబోవు రోజుల్లో ఈ చిత్ర వసూళ్లు ఎలా ఉంటాయో వేచి చూడాలి.