ఈ మధ్యకాలంలో విడుదలై ఘన విజయం అందుకున్న సినిమాల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది 'గీత గోవిందం'. విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసేసింది. పది కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా వంద కోట్ల షేర్ సాధించింది. సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులందరూ ఈ సినిమాను పొగుడుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు.

అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి వంటి తారలు ఈ సినిమా ప్రమోషన్స్ లో కీలక పాత్ర పోషించారు. కానీ అల్లు శిరీష్ మాత్రం ఈ సినిమాపై ఒక్క కామెంట్ కూడా చేయలేదు. రానా నిర్మించిన 'కేరాఫ్ కంచరపాలెం' సినిమాని ప్రోత్సహిస్తూ ట్వీట్ చేసిన అల్లు శిరీష్ కి తన తండ్రి నిర్మించిన 'గీత గోవిందం'పై ఒక ట్వీట్ పెట్టడానికి సమయం లేదా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

అల్లు శిరీష్ 'గీత గోవిందం' సక్సెస్ ని జీర్ణించుకోలేకపోతున్నాడని సమాచారం. నిజానికి అల్లు అరవింద్ ఈ కథని శిరీష్ కోసం ఎంపిక చేశారట. కానీ దర్శకుడు పరశురామ్ మాత్రం తనకు మరో హీరో కావాలని విజయ్ దేవరకొండ ఏరికోరి మరీ ఈ ప్రాజెక్ట్ లో భాగం చేశాడు.

సాదాసీదా కథ అయినప్పటికీ విజయ్ కి ఉన్న క్రేజ్ తో ఈ సినిమా నిలబడిందని అదే అల్లు శిరీష్ చేసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదని అతడిని విమర్శిస్తూ కొన్ని వార్తలు వచ్చాయి. దీంతో అల్లు శిరీష్ హర్ట్ అయ్యాడట. ఇప్పటికీ ఈ సినిమా సక్సెస్ ని తట్టుకోలేకపోతున్నాడని టాక్.