ప్రముఖ స్టిల్‌ ఫోటోగ్రాఫర్‌ జి.శ్రీనివాస్‌(54) కన్నుమూశారు. గురువారం అర్థరాత్రి(శుక్రవారం 1am) రాజమండ్రిలో గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. అల్లు అర్జున్‌ `పుష్ప` షూటింగ్‌ నిమిత్తం మారేడుమిల్లి వెళ్లిన శ్రీనివాస్‌కి ఆరోగ్యం  బాగాలేకపోవడంతో లొకేషన్‌ లోని అంబులెన్స్ లో రాజమండ్రి తరలిస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తుంది. దీంతో `పుష్ప` యూనిట్‌లో విషాదం నెలకొంది. విషయం తెలిసి అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌, ఇతర టీమ్‌ దిగ్ర్భాంతికి గురయ్యారు. 

అదే సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలోనూ విషాదం నెలకొంది. జి.శ్రీనివాస్‌ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. జి. శ్రీనివాస్‌ రెండు వందలకుపైగా సినిమాలకు స్టిల్‌ ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. తారలకు చెందిన  అద్భుతమైన ఫోటోలు తీసిన ఘనత ఆయనది. లొకేషన్‌లోనూ సహజత్వాన్ని పట్టి ఫోటోల్లో బంధించేవారు. ఆయన మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయ. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.