స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వెండితెరపై కనిపించి ఏడాది గడిచిపోతోంది. నా పేరు సూర్య చిత్రం గత ఏడాది సమ్మర్ లో రిలీజై నిరాశపరిచింది. ఎట్టకేలకు బన్నీ ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని చిత్రాన్ని ప్రారంభించాడు. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా మరో రెండు ప్రాజెక్ట్స్ ని కూడా అల్లు అర్జున్ ఓకే చేశాడు. త్రివిక్రమ్ చిత్రం తర్వాత బన్నీ యువ దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించబోయే ఐకాన్ చిత్రంలో నటిస్తాడు. 

మరోవైపు స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో కూడా బన్నీ ఓ చిత్రాన్ని చేయాల్సి ఉంది. ఈ చిత్రానికి ప్రకటన మాత్రమే వచ్చింది. ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి. కానీ వేణు శ్రీరామ్ మాత్రం స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నాడు. తన సినిమాల విషయంలో ఇక డిలే చేయకూడదని భావిస్తున్న బన్నీ 'ఐకాన్' చిత్ర షూటింగ్ కూడా త్రివిక్రమ్ చిత్రానికి సమాంతరంగా జరపాలని భావిస్తున్నాడట. 

దీనితో త్రివిక్రమ్, బన్నీల చిత్ర తదుపరి షెడ్యూల్ నెలరోజుల పాటు నిరవధికంగా సాగనునట్లు తెలుస్తోంది. మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయ్యాక ఐకాన్ చిత్రాన్ని ప్రారంభించాలని బన్నీ భావిస్తున్నాడు. ఐకాన్ చిత్రం వల్ల త్రివిక్రమ్ షూటింగ్ వేగంగా జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. త్రివిక్రమ్ దర్శకత్వంలోని చిత్రానికి రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఐకాన్ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించబోతున్నారు.