స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం తెరకెక్కుతోంది. అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. 

తాజాగా ఈ చిత్ర సెట్స్ లో ఊహించని సంఘటన జరిగినట్లు పలు ఆంగ్ల పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి. కో డైరెక్టర్ సత్యం, అల్లు అర్జున్ మధ్య వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కో డైరెక్టర్లు షాట్ రెడీ అయిన తర్వాత హీరోలకు సమాచారం ఇస్తారు. షాట్ రెడీ అయింది రావాలని పిలుస్తారు. 

అల్లు అర్జున్ కు సత్యం షాట్ రెడీ అయిందని మూడు సార్లు చెప్పాడట. కానీ షాట్ లోకి రాకుండా అల్లు అర్జున్ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మాటి మాటికీ పిలుస్తున్నాడు అని స్క్రిప్ట్ పేపర్లని బన్నీ అతడిపై విసిరి కొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ సంఘటనతో మనస్తాపానికి గురైన సత్యం డైరెక్టర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని డైరెక్టర్స్ అసోసియేషన్ చెబుతోంది. ఈ సంఘటనపై చిత్ర యూనిట్ ఇంకా స్పందించలేదు.