అల్లు అర్జున్ బర్త్ డే వేడుకల కోసం ఫ్యాన్స్ చూపిన అత్యుత్సాహం పోలీస్ చర్యలకు కారణం అయ్యింది. బన్నీ ఫ్యాన్స్ పై కేసు నమోదు కావడం జరిగింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రశాంత్, మరో అభిమాని సంతోష్ పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 290,336, 188 సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేయడం జరిగింది. 


ఏప్రిల్ 8 గురువారం అల్లు అర్జున్ బర్త్ డే నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి అభిమానులు జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 68లో గల బన్నీ నివాసం వద్దకు చేరుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, కోవిడ్ రూల్స్ అధిగమిస్తూ... దాదాపు గంట సేపు భారీ బాణాసంచా కాల్చడం జరిగింది. పెద్ద పెద్ద శబ్దాల కారణంగా అసహనానికి గురైన స్థానికులు,  తమకు నిద్ర లేకుండా చేశారంటూ డైల్ 100 కి కాల్ చేసి ఫిర్యాదు చేశారట. 


పెట్రో కార్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, జూబ్లీ హిల్స్ పోలీసులు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై కేసు నమోదు చేసినట్లు సమాచారం. గురువారం సైతం వందల సంఖ్యలో బన్నీ నివాసం వద్దకు ఫ్యాన్స్ చేరుకొని ఆయనకు స్వయంగా బర్త్ డే విషెష్ తెలియజేశారు. ఎక్కడి నుండో తనకు బర్త్ డే విషెష్ తెలియజేయడానికి వచ్చిన ఫ్యాన్స్ కి అభివాదం చేసిన అల్లు అర్జున్, వారికి కృతజ్ఞతలు తెలిపారు.


ఇక బన్నీ బర్త్ డే కానుకగా విడుదలైన పుష్ప టీజర్ అద్భుత  రెస్పాన్స్ అందుకుంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతుండగా, భారీ అంచనాలు ఉన్నాయి.