తెలుగు చిత్ర పరిశ్రమలో క్రమంగా కొత్త టాలెంట్ పెరుగుతోంది. యువ హీరోలు, దర్శకులు చిన్న చిత్రాలతో సత్తా చాటుతున్నారు. ఇటీవల విడుదలైన 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'బ్రోచేవారెవరురా' చిత్రాలే ఇందుకు నిదర్శనం. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీని చిత్ర యూనిట్ తో కలసి చూశాడు. 

ఈ చిత్రంలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, స్క్రీన్ ప్లేకు బన్నీ ఫిదా అయ్యాడు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రాన్ని చూశా. ఇది కామెడీతో కూడుకున్న మంచి థ్రిల్లర్ మూవీ. టాలెంట్ ఉన్న కొత్త తరం నటులు, దర్శకులు టాలీవుడ్ లోకి రావడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కి ఇవే నా శుభాకాంక్షలు' అని బన్నీ ట్వీట్ చేశాడు. 

దర్శకుడు, హీరోతో కలసి దిగిన ఫోటోని షేర్ చేశాడు. మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రాన్ని చూసి సోషల్ మీడియాలో అభినందించాడు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. మొత్తంగా ఈ కొత్త ఏజెంట్ కి మెగా హీరోలంతా ఫిదా అవుతున్నారు.