బ్రిటీష్ వారు భారతదేశాన్ని పాలించిన సమయంలో భారతీయులు ఎదురుతిరిగి వారితో సమరానికి సిద్ధమయ్యారు. ప్ర‌థ‌మ స్వాతంత్య్ర స‌మ‌రం 1857లో జ‌రిగింద‌ని చరిత్ర ప్రకారం తెలుస్తోంది. అయితే అంతకంటే ముందుగానే ఓ తెలుగు వీరుడు బ్రిటీష్ వారికి ఎదురు నిలిచారు. అతడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.

చరిత్ర మర్చిపోయిన ఈ వీరుడి గాథను 'సైరా నరసింహారెడ్డి'గా వెండితెరపై ఆవిష్కరించాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయగా.. రామ్ చరణ్ స్వయంగా నిర్మించారు. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో కొందరు చరిత్రకారులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు.

నరసింహారెడ్డి మొదట బ్రిటీష్ వారి ఆధీనంలో పాలేరుగా వ్యవహరించేవాడని.. ఆయనకి ఓ బ్రిటీష్ అధికారికి జరిగిన గొడవ పెద్దది కావడంతో అది పోరుగా దారి తీసిందని చరిత్రకారులు చెబుతున్నారు. తన ప్రాంతం, తన హక్కుల కోసం ఉయ్యాలవాడ పోరాటం చేశాడే తప్ప దేశం మీద ఉన్న భక్తితో కాదని ఆరోపణలు చేస్తున్నారు.

అయితే మరికొందరు మాత్రం ఈ ఆరోపణల్లో నిజం లేదని అంటున్నారు. మొదటి స్వాతంత్య్ర సమరం కూడా హక్కుల పరిరక్షణ కోసమే ప్రారంభమైందని.. ఎవరు స్వాతంత్య్రం కావాలని పోరాడలేదని..ఆ తరువాత రూపాంతరం చెందిందని అంటున్నారు.