అల్లరి నరేష్, మహేష్ బాబు మధ్య స్నేహం.. వింటానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఓ కామెడీ హీరో, సూపర్ స్టార్ కలిసి కబుర్లు చెప్పుకుంటారా.. నవ్వుకుంటారా అంటే అవుననే వినపడుతోంది. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారట. మహర్షి సినిమా కోసం అల్లరి నరేష్ , మహేష్ కలిసారు. 

ఈ సినిమాలో ఇద్దరూ స్నేహితులుగా కనిపిస్తారట. వాస్తవానికి మొదట నరేష్ పాత్ర లేదట. అయితే సెకండాఫ్ లో చాలా సీరియస్ గా కథ నడుస్తోంది..ఏదైనా ఫన్ పాత్ర ఉంటే రిలీఫ్ గా ఉంటుంది అని మహేష్ భావించటంతో..దర్శకుడు అల్లరి నరేష్ క్యారక్టర్ డిజైన్ చేసారట. ఆయన పాత్ర పల్లెలో ఉంటుందట. మహేష్ అమెరికా నుంచి వచ్చి పల్లెలో వ్యవసాయం చేసేటప్పుడు ఆయనకు సపోర్ట్ గా నిలబడే పాత్ర అని తెలుస్తోంది. 

లోకల్ గా ఉండే ఈ పాత్ర గమ్యంలో నరేష్ పాత్రలా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ఈ నేపధ్యంలో నరేష్, మహేష్ కొన్ని సార్లు కలవటం జరిగింది. నరేష్ పాత్రను ఇంప్రవైజ్ చేసే తీరు చూసి మహేష్ చాలా ఇంప్రెస్ అయ్యారట. మహేష్ జోవియల్ నేచర్... నరేష్ కు తెగ నచ్చేసిందట. దాంతో అప్పటినుంచి ఇద్దరూ టచ్ లో ఉండటం జరుగుతోందట.

అలా వీళ్లిద్దరు మధ్య ఓ చక్కటి అనుబంధం ఏర్పడిందని, తెరపై కూడా అది ప్రతిఫలిస్తుందని, నిజ జీవిత స్నేహితులు తెరపై కూడా అలాగే కనపడితే ఆ సీన్స్ లో జీవం వస్తుందని భావిస్తున్నారు. అయితే ఇదంతా దర్శకుడు వంశీ పైడిపల్లి ఊహించే...ఇలా వీళ్లిద్దరని కలిపారనే మరో టాక్ కూడా నడుస్తోంది. 

 ఇక చిత్రం షెడ్యూల్ వివరాల్లోకి వెళితే.. మహేష్  నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’ అమెరికా షెడ్యూల్ పూర్తయింది. అక్టోబర్ 18  నుంచి నవంబర్ చివరి వరకూ వరకూ అమెరికాలో భారీ షెడ్యూల్ని ప్లాన్ చేసారు. కానీ , నవంబర్ 2 నాటికే 40రోజుల షెడ్యూల్ని ముగించి తిరిగి ఇండియాకి వస్తున్నారు. ఇక్కడికి   రామోజీ ఫిలింసిటీలో విలేజ్ సెట్లో భారీ షెడ్యూల్ ఉంటుందని తెలిసింది. ఏప్రిల్ 5న ఉగాది కానుకగా సినిమాని రిలీజ్ చేయనున్నారు. దిల్‌రాజు-, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.