బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మాజీ అసిస్టెంట్ వేదిక ప్రకాష్ శెట్టి అరెస్ట్ అయ్యారు. 76 లక్షల మోసం కేసులో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మాజీ అసిస్టెంట్ వేదిక ప్రకాష్ శెట్టిని జుహు పోలీసులు అరెస్ట్ చేశారు. వేదికపై ఆర్ధిక మోసం ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆలియా, ఆమె ప్రొడక్షన్ కంపెనీ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ నుంచి 76 లక్షలకు పైగా డబ్బు దొంగిలించారని ఆరోపణ. వేదికపై ఫిర్యాదు చేసిన దాదాపు ఐదు నెలల తర్వాత బెంగళూరులో ఆమెను అరెస్ట్ చేశారు.

ఆలియా భట్ దగ్గర 76 లక్షల మోసం

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం వేదిక ఆలియాభట్ సంతకాన్ని ఫోర్జరీ కూడా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆలియా నకిలీ సంతకం వాడి, ప్రొడక్షన్ కంపెనీ అకౌంట్ల నుంచి రెండేళ్లలో లక్షల రూపాయలు తీసుకున్నట్టు తెలిసింది. 2023, 2025 మధ్య ఎటర్నల్ సన్‌షైన్, ఆలియా పర్సనల్ అకౌంట్ల నుంచి 76 లక్షలు తీసుకుని మోసం చేసినట్టు ఆరోపణ.

వేదిక ప్రకాష్ అరెస్ట్

ఆలియా తల్లి, నటి సోనీ రాజ్‌దాన్ ఫిబ్రవరిలో వేదిక ప్రకాష్ శెట్టిపై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి విచారణ జరుగుతోంది. అప్పటి నుంచి వేదిక ప్రకాశ్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే రీసెంట్ గా ముంబై పోలీసులు బెంగళూరులో వేదికను పట్టుకుని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోడానికి పోలీసులు ఆమె బ్యాంక్ అకౌంట్ చెక్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఆలియా కాని ఆమె టీమ్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఆలియా భట్ పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో లవ్ అండ్ వార్ సినిమా ఉంది. ఈ సినిమాలో ఆమె భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటిస్తోంది. విక్కీ కౌశల్ మరో హీరోగా నటిస్తున్నారు. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో జీ లే జరా సినిమాలో కూడా ఆలియా నటిస్తోంది. ఈ సినిమాలో కత్రినా కైఫ్, ప్రియాంకా చోప్రా కూడా నటిస్తున్నారు.