దర్శకుడు శంకర్ తన సినిమాలను హిందీలో కూడా విడుదల చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్కెట్ విలువ పెంచడానికి బాలీవుడ్ తారలను తన సినిమాలో తీసుకుంటూ ఉంటాడు. '2.0' సినిమాలో విలన్ గా అక్షయ్ కుమార్ తీసుకున్నాడు.

ఆయన కారణంగానే బాలీవుడ్ లో సినిమా క్రేజ్ బాగా పెరిగింది. ఇప్పుడు మరోసారి అక్షయ్ కి తన సినిమాలో అవకాశం ఇచ్చాడు శంకర్. గతంలో కమల్ హాసన్ హీరోగా 'భారతీయుడు' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా పెద్ద సక్సెస్ అయింది.

ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ను రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో కమల్ హాసన్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. కథ ప్రకారం సినిమాలో కీలకపాత్ర కోసం ముందుగా అజయ్ దేవగన్ ని ఎంపిక చేసుకున్నారు. కానీ అజయ్ కి ఉన్న కమిట్మెంట్ల కారణంగా సినిమా నుండి తప్పుకున్నాడు. 

దీంతో అతడి స్థానంలో అక్షయ్ కుమార్ ని రంగంలోకి దింపారు. శంకర్ అడిగిన వెంటనే అక్షయ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందనే విషయంలో స్పష్టత లేనప్పటికీ కమల్ తో సమానమైన పాత్ర ఇచ్చినట్లు సమాచారం. కాజల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.