బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌ని మినీ ఇండస్ట్రీగా పిలుస్తారు. ఆయన ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటారు. ఈ రకంగా ఏడాదికి కేవలం అక్షయ్‌ కుమార్‌ సినిమాలపైనే ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి కోట్ల వ్యాపారం జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. అత్యంత సంపాదన కలిగిన స్టార్‌గా ఫోర్బ్స్ లోకి కూడా అక్షయ్‌ ఎక్కారు. ఆయన ఫ్యామిలీ లైఫ్‌ చాలా సాఫీగా సాగిపోతుంది. భార్య, మాజీ హీరోయిన్‌ ట్వింకిల్‌ ఖన్నా, అక్కీ అన్యోన్యమైన జంటగా నిలుస్తున్నారు. 

ఇదిలా ఉంటే తాజాగా తన టీనేజ్‌ లవ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు అక్షయ్‌. పెళ్లికి ముందు ఓ అమ్మాయితో డేట్‌కి వెళ్లారట. ఆ అమ్మాయితో త్వరగానే బ్రేకప్‌ అయ్యిందని చెప్పారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్‌ తొలి ప్రేమ విషయాలు చెబుతూ, టీనేజ్‌లో ఓ అమ్మాయితో నాలుగైదు సార్లు డేట్‌కి వెళ్లారట. సినిమాలు, రెస్టారెంట్లకు తిరగడం చేశారట. కొన్నాళ్లపాటు బాగా ఎంజాయ్‌ చేశారట. అంతా సాఫీగా, సంతోషంగా జరిగిపోతున్న సమయంలో ఉన్నట్టుండి ఆ అమ్మాయి బ్రేకప్‌ చెప్పిందట. దీంతో అక్షయ్‌ షాక్‌కి గురయ్యారట. 

అయితే ఆమె బ్రేకప్‌కి చెప్పిన కారణాలు చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు అక్షయ్‌. తాను రొమాంటిక్‌గా లేకపోవడమే కారణట. ముద్దులు పెట్టడం లేదని, కౌగిలించుకోమని, చేతిలో చెయ్యేసి నడవడం వంటి పనులు చేయలేదని తనని వదిలేసిందని చెప్పారు. ఆ విషయాల్లో నాకు మొదటి నుంచి సిగ్గు, అదే సమస్యగా మారిందని చెప్పారు. అయితే అక్షయ్‌ ఆ తర్వాత చాలా మంది హీరోయిన్లతో లవ్‌ ఎఫైర్‌ నడిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్షయ్‌ నటించిన `సూర్యవంశి` విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు `అట్రాంగి రే`, `బెల్‌ బాటమ్‌`, `పృథ్వీరాజ్‌`, `బచ్చన్‌ పాండే` వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.