`వైల్డ్ లైఫ్‌` గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రకృతిని, అడవులు, అందులోని పక్షులు, జంతువులు, ఇతర జీవరాశులు, మనుషులు, మొత్తంగా వాటి జీవన విధానం, జీవన గమ్యాన్ని వివరిస్తుంది. డిస్కవరీ ఛానెల్‌లో ఇది ప్రసారమవుతుంది. ఆద్యంతం సాహసభరితంగా `ఇన్‌ టూ ది వైల్డ్` అనే కార్యక్రమం సాగుతుంది. 

ప్రముఖ సాహసవీరుడు బేర్‌ గ్రిల్స్ దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయన వైల్డ్ లైఫ్‌ గురించి ఇందులో వివరిస్తుంటారు. అయితే అప్పుడప్పుడు ఈ కార్యక్రమంలో ప్రముఖులను కూడా తీసుకెళ్తుంటారు. వారితోనూ సాహసం చేయిస్తుంటారు. ఈ క్రమంలో వారి అనుభవాలను, వారు ఎదిగిన విధానాన్ని ప్రపంచానికి చెబుతుంటారు. 

ఇండియాలో ఇలా వెళ్ళిన ప్రముఖులు చాలా తక్కువ. ఇటీవల దేశ ప్రధాని నరేంద్రమోడీ, ఆ తర్వాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఈ `ఇన్‌ టూ ది వైల్డ్` కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా బాలీవుడ్‌ హీరో ఆక్షయ్‌ కుమార్‌కి ఆ అరుదైన అవకాశం దక్కింది. ఈ విషయాన్ని అక్షయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా టీజర్‌ని విడుదల చేశారు. 

ఇందులో `మీరు నాకు పిచ్చి అనుకోవచ్చు. పిచ్చి ఉన్న వాళ్ళే ఇంత దట్టమైన అడవిలోకి వెళ్ళగలుగుతారు` అని అక్షయ్‌ ఈ వీడియోకి క్యాప్షన్‌ పెట్టాడు. ఈ షూటింగ్‌ ఈ ఏడాది జనవరిలోనే జరిగిందట. కర్నాటకలోని బందీపూర్‌ టైగర్‌ రిజర్వ్ ఫారెస్ట్ లో ఈ ఎపిసోడ్‌ని షూట్‌ చేశారట. ఈ షూటింగ్‌ను అక్షయ్‌ కుమార్‌ ఒక్క రోజులో పూర్తి చేశారట. ఈ కార్యక్రమం సెప్టెంబర్‌ 11న రాత్రి ఎనిమిది గంటలకు డిస్కవరీ ప్లాస్‌ ఇండియాలో ప్రసారం కానుంది. అలాగే డిస్కవరీ ఛానెల్‌లో సెప్టెంబర్‌ 14న రాత్రి ఎనిమిది గంటలకు ప్రసారం చేయనున్నారు. ఇదిలా ఉంటే డిస్కవరీ ఛానెల్‌ ప్రారంభించి 25ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అక్షయ్‌ ఎపిసోడ్‌ ప్రసారం కావడం విశేషం.