అక్షయ్ కుమార్ నటిస్తున్న లక్ష్మీ బాంబ్ చిత్రం విడుదల కాకముందే రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ హక్కులు ఏకంగా రూ.125 కోట్లకు అమ్ముడై రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని హాట్ స్టార్ వారు తీసుకున్నారు. ఆగస్టు 15, స్వతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఈ సినిమాని ఆన్ లైన్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలిస్తోంది. ఇప్ప‌టికే మేక‌ర్స్ డిస్నీ హాట్ స్టార్ వారితో సంప్ర‌దింపులు కూడా జ‌రిపిన‌ట్టు తెలుస్తుంది. 

ఓటీటీలో ఆ తేదీకి రిలీజ్ చేయ‌డంపై అక్ష‌య్ , చిత్ర ద‌ర్శ‌కుడు లారెన్స్ చ‌ర్చించి ఏకాభిప్రాయానికి వ‌చ్చార‌ట‌. కొంత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ మిగిలి ఉండగా, వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి ఆగస్టులో చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. కాంచ‌న చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ల‌క్ష్మీ బాంబ్ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టించింది. 

సాధారణంగా పెద్ద సినిమాలకు రూ.60 నుంచి రూ.70 కోట్ల వరకు చెల్లించేందుకు ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థలు ముందుకొస్తూంటాయి. అయితే ఇలా ఓ సినిమా డిజిటల్ హక్కులు ఈ స్థాయిలో  అమ్ముడవటం బాలీవుడ్‌లో ఇదే తొలిసారి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో సినిమాలను విడుదల చేసేందుకు వీలులేకపోవడంతో లక్ష్మీబాంబ్‌ నేరుగా ఆన్‌లైన్‌లోనే విడుదల చేయనున్నారు. అందుకే ఈ స్థాయిలో రేటు పలికినట్లు తెలుస్తోంది.

 అంతేకాకుండా తమిళంలో  రాఘవ లారెన్స్ నటించి, దర్శకత్వం వహించిన కాంచన సినిమా పెద్ద హిట్ అయింది. అదే చిత్రాన్ని హిందీలో లక్ష్మీబాంబ్‌గా రీమేక్ చేస్తున్నారు. ఈ  కారణం వల్ల కూడా ఈ చిత్రానికి భారీ ధర పెట్టినట్లు సమాచారం.