సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మహానటి. ఇటీవలే తెరకెక్కిన తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు నాగ చైతన్య వెండితెరపై అభిమానులను అలరించబోతున్నారు. ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'మహానటి' చిత్రంలో చైతన్య తాత పాత్రలో కనిపించనున్నాడు.

 

ఏఎన్ఆర్ పాత్ర కోసం చిత్ర బృందం ఇటీవలే నాగ చైతన్యను సంప్రదించగా అతడు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. చిన్న అతిథి పాత్రే కావడంతో నాలుగైదు రోజుల్లో నాగ చైతన్య పోర్షన్ కంప్లీట్ కానుందని, త్వరలో అతడు సెట్స్‌ లో అడుగు పెట్టబోతున్నారని సమాచారం. ఏఎన్నార్‌తో పాటు, ఎన్టీఆర్‌, ఎస్వీ రంగారావు, జెమినీ గణేశన్‌, చక్రపాణి, కె.వి రెడ్డి ప్రముఖుల పాత్రలు సినిమాలో కనిపించనున్నాయి. ఎస్వీ రంగారావుగా మెహన్‌బాబు, చక్రపాణిగా ప్రకాష్‌రాజ్, సావిత్ర భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్క‌ర్ స‌ల్మాన్‌, జమున పాత్రలో సమంత, కె.వి.రెడ్డి పాత్రలో క్రిష్‌ నటిస్తున్నారు.

 

'మహానటి' చిత్రానికి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రను పోషిస్తున్నారు. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన సావిత్రి సినిమా రంగంలో మహానటిగా ఎదిగిన పరిణామాలతో పాటు, ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను సైతం చూపించనున్నారు.

 

సావిత్రి సినీ జీవితంలో చెప్పుకోదగ్గ అత్యంత ముఖ్యమైన సినిమా ‘మాయా బజార్'. ఈ సినిమా ప్రస్తావన లేకుండా సావిత్రి బయోపిక్ తీయడం కష్టమే. అందుకే సినిమాలో ‘మాయా బజార్' ఎపిసోడ్ హైలెట్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా సెట్స్ వేశారు. 'వైజయంతి మూవీస్', 'స్వప్న సినిమాస్' సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.