చిత్రం: వివేకం తారాగణం:అజిత్, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, అక్షర హాసన్ సంగీతం: అనిరుథ్ రవిచంద్ర దర్శకత్వం: శివ నిర్మాణం: సత్యజ్యోతి ఫిలింస్ ఏసియానెట్ రేటింగ్-3/5
కోలీవుడ్ లో అజిత్ ఎంతో క్రేజ్ వున్న హీరో. దాదాపు 20 నెలల గ్యాప్ తర్వాత అజిత్ హీరోగా తెరకెక్కిన వివేకం మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళ్ తో పాటు తెలుగు, ఇతర భాషల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా వివేకం చిత్రం విడుదలైంది. టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకుల్లో హాలీవుడ్ తరహాలో వుందంటూ హై ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేసిన వివేకం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా రివ్యూలో చూద్దాం.
కథ...
హాసినీ(కాజల్), అజయ్ కుమార్(అజిత్) ఇద్దరు అన్యోన్యంగా దాంపత్యం సాగించే అందమైన జంట. అజయ్ కుమార్ నిఘా విభాగంలో పనిచేసే ఇంటలిజెన్స్ ఏజెంట్. హాసిని అంటే అమితమైన ప్రేమ. అన్యోన్యంగా జీవిస్తుంటారు. అజయ్ విధి నిర్వహణలో భాగంగా ఉగ్రవవాదుల ఏరివేత, వాళ్ల కార్యకలాపాలను పసిగట్టి అణిచి వేయటం చేస్తుంటాడు. అతనికి సడెన్ గా ఓ నెప్టూనియం వెపన్స్ వుపయోగించి వివిధ దేశాల్లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నిన గ్యాంగ్ ను పట్టుకోవాలంటూ రెడ్ అలర్ట్ నోటీస్ వస్తుంది. దాంతో అన్యోన్యంగా జీవిస్తుంది ఆ జంట విడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఓ ఆపరేషన్ నిమిత్తం అజయ్ కుమార్ కు రెడ్ అలర్ట్ నోటీసులు రావటంతో వెంటనే.. విధులకు హాజరవుతాడు అజయ్.
నెప్టూనియం వెపన్స్ టార్గెట్ చేసిన దేశాల్లోని జనాన్ని కాపాడేందుకు అజయ్ అండ్ టీమ్ రంగంలోకి దిగుతుంది. ఆ టీమ్ లో తనకు నమ్మకంగా వుండే వాళ్లను తీసుకుంటాడు అజయ్. అందులో అజయ్ ఎంచుకున్న ఆర్య(వివేక్ ఓబెరాయ్) కూడా ఒకడు. ఆ వెపన్స్ అమర్చిన వివరాలున్న ఎథికల్ హాకర్ నటాషా(అక్షర హాసన్) తానెవరో గుర్తు పట్టకుండా వుండేలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని సెర్బియాలో వుంటుంది. తన టీమ్ తో సెర్బియా వెళ్లి ఆ యువతిని వలపన్ని పట్టుకున్న అజయ్... ఆమె అమాయకురాలని గుర్తిస్తాడు. ఆమె సహాయంతో ఆ వెపన్ ను డిఫ్యూజ్ చేసేందుకు వెళ్తుంటాడు. ఆ సమాచారం తన కార్యాలయానికి చేరవేస్తాడు.
అయితే మార్గమధ్యంలో కాపు కాసిన గ్యాంగ్ అతన్ని టార్గెట్ చేసి షూట్ చేస్తుంది. విధులకు వెళ్లే ముందు భార్యతో తిరిగి వస్తానని చెప్పిన అజయ్.. గాయాలతో వుండగానే హాసిని అతనికి ఫోన్ చేస్తుంది. అప్పుడు మాట్లాడలేని స్థితిలో వుండే అజయ్.. తనకేమైనా సరే తిరిగి వస్తానని.. ఆ నమ్మకంతో వుండమని చెప్తాడు. మరి ఆ గ్యాంగ్ ఎవరు.. వాళ్ల లక్ష్యం ఏంటి.. వాళ్ల నుంచి తన భార్యను ఎలా కాపాడుకుంటాడు.. చివరకు ఆ గ్యాంగ్ ను అంతం చేసి నెప్టూనియం వెపన్స్ ను అజయ్ ఎలా నిర్వీర్యం చేస్తాడన్నదే మిగతా కథ.
ఎలా వుందంటే...
శివ దర్శకత్వంలో తెరకెక్కిన వివేకం సినిమాలో కథ చాలా బలమైంది. భార్య భర్తల మధ్య అనుబంధం ఆప్యాయతలను టచ్ చేస్తూనే... నిఘా విభాగంలో పనిచేసే వ్యక్తి ఆలోచనలు ఎలా వుంటాయి.. ఎమోషనల్ గా ఎంత స్ట్రాంగ్ వుంటారు.. ప్రత్యర్థులను ఎలా అంతం చేస్తారు అన్నది కథలో చాలా చక్కగా పొందుపరిచారు. ఇక.. చిత్రం స్క్రీన్ ప్లే చాలా చక్కగా సాగింది. అజిత్, కాజల్ మధ్య ప్రేమ సన్నివేశాలు.. గడ్డు కాలంలో పరిస్థితులను ఎదిరించి నిలవడంలో ప్రేమగా వుండే భార్యాభర్తల మధ్య వుండే కెమిస్ట్రీ ఎలావుంటుందో, దాని వల్ల ఎలాంటి అద్భుతాలు చేయొచ్చో, తమను తాము ఎలా కాపాడుకోవచ్చో అద్భుతంగా చూపించారు. ఇక హీరో, మెయిన్ విలన్ మధ్య జరిగే మైండ్ గేమ్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ.. ఎలా పై చేయి సాధించారు, చివరకు అజయ్ ఎలా పైచేయి సాధించాడు అన్నది ఆసక్తికరంగా అనిపిస్తుంది.
నటీనటులు :
అజిత్, కాజల్, వివేక్ ఒబెరాయ్ ల నటన ఈ మూవీకి ప్లస్ పాయింట్. ఇక స్పెషల్ అప్పియరెన్స్ లా కాసేపు మాత్రమే కనిపించినా అక్షర హాసన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. అజిత్ ప్రతి ఫ్రేములోనూ తనదైన శైలిలో కనిపించారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో అజిత్ నటన హైలైట్ గా నిలిచింది. టెర్రరిస్ట్ గా ముద్ర పడ్డ అజిత్ ఆ తర్వాత సీరియస్ యాక్షన్ ఎలా వుంటుందో చూపిస్తాడు. ఓ పక్క తన భార్య హాసినిని కాపాడుకుంటూ.. ఆర్య అండ్ గ్యాంగ్ ను అంతమొందించడం ఆకట్టుకుంటుంది. అయితే నాలుగు ప్రధాన పాత్రలు తప్ప పెద్దగా మిగతా పాత్రలకు ప్రాధాన్యత లేదని చెప్పాలి.
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు శివ ఇంటలిజెన్స్ వ్యవస్థలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎలా చేరుతాయి.. ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవటానికి రాజకీయాల్లో, వివిధ సెక్యురిటీ ఏజెన్సీల్లో ఎలా ఏజెంట్లను పెట్టుకుని పనిచేస్తాయన్న సీరియస్ కథకు.. భార్యా భర్తల ఎమోషన్ ను జోడించి అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక మ్యూజిక్ పరంగా అనిరుథ్ రవిచంద్రన్ మ్యూజిక్ అద్భుతంగా వుందని చెప్పాలి. మెలొడీతో కూడిన పాటలేకాక యాక్షన్ సీక్వెన్స్ లకు తగ్గట్టుగా.. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ప్రతి సన్నివేశానికి తగ్గట్టుగా అందించాడని చెప్పాలి. కెమెరా వర్క్ పరంగా కూడా సీన్స్ అన్నీ అద్భుతమైన టేకింగ్ అనిపించేలా కనిపిస్తాయి. ఇక కెమెరామన్ గా వెట్రి పళనిస్ టేకింగ్ అద్భుతంగా వుందని చెప్పాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రానికి హీరో అజిత్, హిరోయిన్ కాజల్, విలన్ వివేక్ ఒబెరాయ్ ల పాత్రలు హైలైట్ గా నిలిచాయి. ఈ ముగ్గురి కేరక్టర్లే చిత్రానికి హైలైట్ అని చెప్పాలి. ప్లస్ పాయింట్లలో చెప్పుకోవాల్సింది అనిరుథ్ సంగీతం కూడా. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
మైనస్ పాయింట్స్:
సినిమా ఆద్యంతం చక్కటి స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నా... చివరకు క్లైమాక్స్ లో ఫైట్ సీన్ ను పాటకు జోడించడం తెలుగు ఆడియెన్స్ కు కాస్త వింతగా అనిపిస్తుంది. అయితే తమిళ ప్రేక్షకులు ఇలాంటి క్లైమాక్స్ లకు కనెక్ట్ అవుతారు.
చివరగా:
స్పై థ్రిల్లర్ తో ఏకే(అజయ్ కుమార్) అలరించాడు. అజిత్ మరో యాంగిల్ చూడాలంటే వివేకం చూడాల్సిందే. మైండ్ గేమ్ ఇష్టపడని వాళ్లుండరు కదా..
