కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తమిళ తారలు ఒక్కొక్కరుగా కదులుతున్నారు. స్టార్‌ హీరోలు సూర్య, కార్తీలు స్టార్ట్ చేయగా,  ఇప్పుడు వరుసగా అజిత్‌, ఉదయనిధి స్టాలిన్‌, దర్శకుడు మురుగదాస్‌, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్‌ తమ వంతుగా విరాళాలు తమిళనాడు సీఎం స్టాలిన్‌కి అందజేశారు. రజనీకాంత్‌ తనయ సౌందర్య రజనీకాంత్‌ తన భర్త విశాగన్‌తో కలిసి కోటి రూపాయలు విరాళంగా అందజేసింది. టీఎన్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కొత్తగా సీఎంగా ఎన్నికైన స్టాలిన్‌కి వారు అభినందనలు తెలియజేశారు. 

వీరితోపాటు తలా అజిత్‌ రూ. 25 లక్షలు విరాళంగా అందజేశారు. అలాగే దర్శకుడు మురుగదాస్‌ రూ. 25లక్షలు చెక్‌ని సీఎం స్టాలిన్‌కి శుక్రవారం అందజేశారు. వీరితోపాటు సీఎం స్టాలిన్‌ తనయుడు, హీరో ఉదయనిధి స్టాలిన్‌ సైతం రూ. 25లక్షలు తమ వంతుగా రాష్ట్రప్రభుత్వానికి విరాళంగా అందించారు. ఆయన ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. ఇలా కోలీవుడ్‌ తారలు స్పందిస్తూ కరోనాని ఎదుర్కొనేందుకు, కరోనా పేషెంట్లని ఆదుకునేందుకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. దీంతో ఇప్పుడు మన తెలుగు స్టార్స్ పై ఒత్తిడి పెరుగుతుంది. 

ఫస్ట్ వేవ్‌ సమయంలో టాలీవుడ్‌ స్టార్స్ సైతం స్పందించి భారీగా విరాళాలు అందించారు. `సీసీసీ`ని స్థాపించి సినీ కార్మికులను ఆదుకున్నారు. లాక్‌ డౌన్‌ సమయంలో కార్మికులకు నిత్యవసర సరుకులు అందజేశారు. మరి ఈ సారి కూడా వారు స్పందిస్తారో లేదో చూడాలి.