కరోనా నిర్మూలించేందుకు, దాన్ని ఎదుర్కొనేందుకు సెలబ్రిటీలు తమ వంతు సాయం చేస్తున్నారు. తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళ స్టయిలీష్‌ స్టార్‌ అజిత్‌ ఓ అడుగు ముందుకేశాడు. డైరెక్ట్‌గా యాక్షన్‌లోకి దిగాడు. పరిసరాలను శానిటైజ్‌ చేసే పనిని తన భుజాలపై వేసుకున్నాడు. ఆయన తన ఆధ్వర్యంలో రన్‌ అయ్యే `దక్ష` సంస్థతో కలిసి డ్రోన్ల సాయంతో పరిసరాలను శుద్ధి చేస్తున్నారు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో డ్రోన్ల సాయంతో అజిత్‌కి చెందిన `దక్ష` టీమ్‌ శానిటైజ్‌ చేస్తుంది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

అజిత్‌ నటుడిగానే కాదు, ఆయనలో చాలా ఇతర కళలున్నాయి. కారు, బైక్‌ రేసింగ్‌లోనూ పాల్గొంటారు. అందులో ఛాంపియన్‌గానూ నిలిచి పతకాలు అందుకున్నారు. దీంతోపాటు టెక్నాలజీపైన కూడా మంచి పట్టుంది. మద్రాస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ స్టూడెంట్స్ తో డ్రోన్ల టెక్నాలజీని డెవలప్‌ చేయడంలో సలహాలు ఇస్తుంటారు. గెస్ట్‌ గా క్లాసులు కూడా చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఆయన కొంత మందితో కలిసి `దక్ష` అనే సంస్థని ప్రారంభించారు. ఇది టెక్నీకల్‌గా ప్రజలకు సహాయం చేసేందుకు ముందుంటుంది. 

ఇక అజిత్‌ ఇటీవల తన 50వ పుట్టిన రోజుని జరుపుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన `వాలిమై` చిత్రంలో నటిస్తున్నారు. హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. కరోనా వల్ల చిత్రీకరణ ఆగిపోయింది. దీంతో అజిత్‌ కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ఇలా తన వంతు సాయం చేస్తున్నారు.