హిందీ భాషపై కన్నడ స్టార్‌ సుదీప్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనిపై బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ కౌంటర్‌ ఇవ్వడం మరింత హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

`హిందీ భాష ఇకపై జాతీయ భాష కాదు` అన్న కన్నడ సూపర్‌స్టార్‌ సుదీప్‌(Sudeep) వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనికి బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగన్‌(Ajay Devgn) రియాక్షన్‌తో అది మరింత వివాదంగా మారింది. జాతీయ భాష అనేది వివాదంగా మారిపోయింది. ఇద్దరు స్టార్ల మధ్య కామెంట్లు ఇప్పుడు ఇండియా వైడ్‌గా చర్చనీయాంశంగా మారుతుండటం గమనార్హం. ప్రస్తుతం సౌత్‌ సినిమాలు నార్త్ లో బాగా ఆదరణ పొందుతున్నాయి. `పుష్ప`, `ఆర్‌ఆర్‌ఆర్‌`, `కేజీఎఫ్‌ 2` చిత్రాలు హిందీ మార్కెట్‌లో దుమ్మురేపాయి. భారీ కలెక్షన్లని సాధించాయి. 

`కేజీఎఫ్‌ 2` ఏకంగా మూడు వందల కోట్లు కలెక్షన్లని కేవలం హిందీలోనూ కలెక్ట్ చేయడం విశేషం. ఈ నేపథ్యంలో ఇటీవల ఉపేంద్ర హీరోగా రామ్‌గోపాల్‌వర్మ రూపొందిస్తున్న `ఆర్‌ః ది డెడ్లీయెస్ట్ గ్యాంగ్‌స్టర్‌ ఎవర్‌` చిత్ర ప్రారంభోత్సవంలో కన్నడ స్టార్‌ సుదీప్‌ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ వాళ్ళు తమ సినిమాలను తెలుగు, తమిళంలో డబ్బింగ్ చేస్తూ విజయం సాధించడానికి కష్టపడుతున్నారు. కానీ అది జరగడం లేదు. ఈ రోజు మనం ఎక్కడైనా సక్సెస్ అయ్యే సినిమాలు చేస్తున్నాం` అని అన్నారు. 

అంతటితో ఆగలేదు. `కేజీఎఫ్ : చాప్టర్ 2` సక్సెస్ పై ఆయన రియాక్ట్ అవుతూ, `హిందీ ఇకపై జాతీయ భాష కాదు` అంటూ కామెంట్స్ చేశారు. ఇక్కడే లాంగ్వేజ్‌ చిచ్చు రాజుకుంది. సుదీప్ వ్యాఖ్యలపై చాలా మంది సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. అయితే బాలీవుడ్‌ స్టార్‌ హీరో, `ఆర్‌ఆర్‌ఆర్‌` యాక్టర్‌ అజయ్‌ దేవగన్‌ రియాక్ట్ కావడం మరింత దుమారం రేపుతుంది. సుదీప్‌కి కౌంటర్‌గా అజయ్‌ దేవగన్‌ పెట్టిన ట్వీట్‌ అగ్నికి ఆజ్యం పోస్తుంది.

సుదీప్‌ను ట్యాగ్ చేస్తూ, హిందీ ఇకపై జాతీయ భాష కాకపోతే, తన మాతృభాష చిత్రాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తున్నారు? అంటూ సూటిగా ప్రశ్నించారు. `బ్రదర్‌ కిచ్చా సుదీప్… మీ అభిప్రాయం ప్రకారం హిందీ మన జాతీయ భాష కాకపోతే మీ మాతృభాష సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తారు? హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృభాష, జాతీయ భాష. జన గణ మన` అని ట్వీట్ చేశారు. ఈట్వీట్‌ ఇప్పుడు లాంగ్వేజ్‌ వార్‌కి తెరలేపినట్టవుతుంది. మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి. దీనిపై సుదీప్‌ ఎలా రియాక్ట్ అవుతారనేది మరింత ఆసక్తికరంగా మారింది. 

Scroll to load tweet…