పొరిగింటి పుల్ల కూర రుచి అనే సామెత మన తెలుగు పరిశ్రమకు చక్కగా సరిపోతుంది. నటన, భాష రాకున్నా కోట్లు కుమ్మరించి ముంబై అమ్మాయిల వెనుకపడే మన దర్శకులు, టాలెంట్ ఉన్న మన తెలుగు అమ్మాయిలను పట్టించుకోరు. తెలుగు అమ్మాయిలు అంటే చులకన భావం ఎప్పటి నుండో టాలీవుడ్ లో ఉంది. ఇక్కడ నిరాదరణకు గురై, మంచి నటులుగా పొరుగు పరిశ్రమలలో గుర్తింపు తెచ్చుకున్నఅమ్మాయిలు చాలా మంది ఉన్నారు. 

శ్రీదివ్య, అంజలి, ఆనంది వంటివారు తెలుగు పరిశ్రమలో అవకాశాలు దొరక్క కోలీవుడ్ లో సెటిల్ అయిన హీరోయిన్స్. టాలెంటెడ్ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచుకున్న ఐశ్వర్య రాజేష్ కూడా అలాంటి కోవకు చెందిన అమ్మాయినే. నటుడు రాజేష్ కుమార్తె అయిన ఐశ్వర్య రాజేష్ కోలీవుడ్ లో ఓ స్థాయి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియల్ చిత్రాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. కోలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య టాలెంట్ ని ఇప్పుడిప్పుడే టాలీవుడ్ గుర్తిస్తుంది. 2019లో కౌసల్య కృష్ణమూర్తి చిత్రం చేసిన ఆమె, విజయ్ దేవరకొండకు జంటగా వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో నటించారు. 

చెన్నైలో సెటిల్ అయిన ఐశ్వర్యకు తెలుగులో నచ్చిన కథలు దొరకడం లేదట. ప్రాధాన్యం లేకపోతే నటించను అని చెబుతున్న ఐశ్వర్య, బోల్డ్ రోల్స్ అసలు చేయనని చెప్పేస్తున్నారు. దేవా కట్టా దర్శకత్వంలో ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీలో ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తున్నారు.