దర్శకురాలు, ధనుష్‌ భార్య ఐశ్వర్య రజనీకాంత్‌ ఇంట్లో చోరీ జరిగింది. లక్షల విలువ చేసే బంగారు అభరణాలు, వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రజనీకాంత్‌ కూతురు, ధనుష్‌ భార్య, ఫిల్మ్ మేకర్‌ ఐశ్వర్య రజనీకాంత్‌ ఇంట్లో దొంగలు పడ్డారు. ఆమె ఇంట్లో లక్షల విలువల చేసే నగలు చోరీకి గురయ్యాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది ఐశ్వర్య రజనీకాంత్‌. ఇంట్లో బంగారం, వజ్రాలు దొంగతానానికి గురైనట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తన ఇంట్లోని ముగ్గురు సిబ్బందిని అనుమానిస్తూ ఆమె తేనాం పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

చోరికి గురైన వాటిలో డైమండ్‌ సెట్‌, ఆలయ అభరణాలలో అన్‌కట్‌ డైమండ్స్, పురాతన బంగారు ముక్కలు, నవరత్నం సెట్లు, బంగారు, వజ్రాలతో కూడిన రెండు నెక్‌ పీసెస్‌కి సరిపడే చెవిపోగులు, ఆరమ్ నెక్లెస్‌, సుమారు 60 సవరీల బ్యాంగిల్స్ ఉన్నాయని పేర్కొంది. వీటి విలువ సుమారు 3.6లక్షల ఉంటుందని ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించారు. కానీ వాస్తవంగా వాటి విలువ అంతకంటే ఎక్కువే ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. 

2019లో తన చెల్లి సౌందర్య పెళ్లి సమయంలో ఆ నగలను తాను వాడినట్టు, ఆ తర్వాత తన లాకర్‌లో ఉంచినట్టు ఐశ్వర్య తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆ లాకర్‌ తన ఆధీనంలోనే ఉన్నప్పటికీ, అప్పట్నుంచి ఇప్పటి వరకు మూడు చోట్లకు మార్చినట్టు చెప్పారు. అందులో భాగంగా 2021 ఆగస్ట్ వరకు ఇది సెయింట్‌ మెరీస్‌ రోడ్‌లోని ఆమె అపార్ట్ మెంట్‌లో ఉంది. ఆ తర్వాత సీఐటీ కాలనీలో నటుడు ధనుష్‌తో ఆమె ఉంటున్న నివాసానికి మార్చబడింది. సెప్టెంబర్‌ 2021లో మళ్లీ సెయింట్‌ మేరీస్‌ రోడ్‌ అపార్ట్ మెంట్‌కి మార్చబడిందని వెల్లడించింది ఐశ్వర్యా. 

అనంతరం 2022 ఏప్రిల్‌ 9, ఆ లాకర్‌ని నటుడు రజనీకాంత్‌ పోయేస్‌ గార్డెన్‌ నివాసానికి మార్చారు. `లాకర్‌ కీలు సెయింట్‌ మేరీస్‌ రోడ్ అపార్ట్ మెంట్‌లోని నా వ్యక్తి గత స్టీల్‌ అల్మారాలో ఉంచాం. ఇది నా సిబ్బందికి తెలుసు. నేను లేనప్పుడు వాళ్లు కూడా తరచూ అపార్ట్ మెంట్‌కి వెళ్లేవారు` అని ఐశ్వర్య తన ఫిర్యాదులో వెల్లడించారు. అయితే ఫిబ్రవరి 10న లాకర్‌ని చెక్‌ చేయగా, ఆ నగలు కనిపించలేదని, అవి పెళ్లైనప్పట్నుంచి దాదాపు 18ఏళ్లుగా ఉన్న నగలని చెప్పింది. ఐశ్వర్య రజనీకాంత్‌ ఫిర్యాదు మేరకు తేనాంపేట పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 381(ఇంటి మనిషి దొంగతనం) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం రజనీకాంత్‌ మరోసారి దర్శకత్వం వహిస్తున్నారు. `లాల్‌ సలామ్‌` పేరుతో ఆమె ఓ సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ గెస్ట్ గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది ఐశ్వర్య. మరోవైపు తన భర్త, హీరో ధనుష్‌తో విడిపోతున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇద్దరూ విడిపోతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత కలిసిపోయారని ప్రచారం జరిగింది. మళ్లీ విడాకుల కోసం కోర్ట్ కెక్కారనే వార్తలు ఊపందుకున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.