అద్భుతమైన నటనకు కేరాఫ్‌గా నిలిచే డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు `ఫర్హానా` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా `పుష్ప` సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అందం, అభినయం కలగలిపిన ఐశ్వర్య రాజేష్ వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయడానికి కారణం ఏంటంటే? ఆ ప్రశ్న హీరోలని అడుగుతారా? అంటూ యాటిట్యూడ్ చూపించి ఇటీవల వార్తల్లో నిలిచింది ఐశ్వర్య రాజేష్. తాజాగా ఆమె మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `పుష్ప` సినిమాలో రష్మిక మందన్నా నటించిన `శ్రీవల్లి` పాత్ర తనకు బాగా సెట్ అవుతుందని వెల్లడించింది. ఐశ్వర్య రాజేష్ నటించిన `ఫర్హాన` సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆసక్తికర విషయాలను పంచుకుంది ఐశ్వర్య.
తెలుగు సినిమాలంటే, తెలుగు ఇండస్ట్రీ అంటే తనకు ఇష్టమని చెప్పింది. అయితే తెలుగులో హీరోయిన్లు తెల్లగా సన్నగా, అందంగా ఉండాలని, గ్లామర్ షో చేయాలని, అలాంటి వారినే హీరోయిన్లుగా తీసుకుంటారని, మనకు సెట్ కాదులే అనే ఆలోచనతో ఉండిపోయిన సమయంలో `వరల్డ్ ఫేమస్ లవర్` చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని చెప్పింది ఐశ్వర్య. అందులో తన పాత్ర కూడా తనలాగే డీ గ్లామర్‌గా ఉంటుందని, మొదట నా పాత్ర కనెక్ట్ కావడం కష్టమని భావించా. కానీ రిలీజ్ అయ్యాక సినిమా ఆడలేదు, కానీ నా పాత్రకి విశేషంగా ఆదరణ దక్కింది. ప్రశంసలు వచ్చాయి.
అంతేకాదు `కౌసల్య కృష్ణమూర్తి` సినిమా సైతం పిల్లలకు ఎంతో బాగా కనెక్ట్ అయ్యిందని, ఇక్కడ తనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఏర్పడిందని చెప్పింది ఐశ్యర్య. `రిపబ్లిక్` సినిమా షూటింగ్ టైమ్‌లో చాలా మంది పిల్లలు తనని కలవడానికి వచ్చారని, కానీ అది తాను నమ్మలేదని అయితే కౌసల్య అక్క కోసమని వాళ్లు చెప్పడంతో ఆశ్చర్యపోయానని తెలిపింది ఐశ్వర్య. ఇప్పుడు తెలుగులో ఆఫర్లు రావడం లేదని కాదు, కానీ మంచి పాత్రలతో కమ్ బ్యాక్ కావాలని ఉందని చెప్పింది.
ఈ సందర్భంగా `పుష్ప` చిత్రం గురించి చెప్పింది. ఒకవేళ `పుష్ప` తనకు అవకాశం ఇచ్చి ఉంటే కచ్చితంగా చేసేదాన్ని అని చెప్పింది. ఇందులో రష్మిక మందన్నా బాగా నటించారని, కాకపోతే శ్రీవల్లి పాత్ర నాకు బాగా సెట్ అవుతుందని తన నమ్మకమని వెల్లడించింది. పరోక్షంగా రష్మిక కంటే తనకే ఇది బాగా సెట్ అవుతుందని ఐశ్వర్య చెప్పింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
