పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా సినిమా అజ్ఞాతవాసి మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. క్రిటికల్ రివ్యూలను ఎదుర్కొంటోంది. త్రివిక్రమ్ మ్యాజిక్ పూర్తిగా మిస్ అయ్యింది, అన్నీ ఉండి కూడా సరైన సినిమా తీయాలేకపోయారనే విశ్లేషణలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే.. ఓపెనింగ్స్ పై వీటి ప్రభావం ఏమీ లేదు. కానీ కలెక్షన్లపై ట్రేడ్ ఎనలిస్టుల విశ్లేషణలు కలవరపెడుతున్నాయి.

 

తొలి రోజు ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అటు ఓవర్సీస్ లో భారీ వసూళ్లు సాధించింది. అయితే 12వ తేదీ నుంచి మరిన్ని సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. అటు బాలయ్య జై సింహాతో పాటు సూర్య గ్యాంగ్ సినిమాలు రేపు విడుదల కానున్నాయి. ఇక ఆ తర్వాత రాజ్ తరుణ్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై తెరకెక్కిన రంగులరాట్నం ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి కథ ఎలా ఉంటుందో ఇప్పుడప్పుడే చెప్పలేని పరిస్థితి.

 

అజ్ఞాతవాసి కలెక్షన్ల విషయానికి వస్తే.. ప్రీ రిలీజ్ బిజినెస్ ను భారీ స్థాయిలో చేసుకున్న ఈ సినిమాకు కొన్ని ప్రాంతాల్లో కొన్ని అవాంతరాలు తప్పడం లేదనే మాట వినిపిస్తోంది. ప్రత్యేకించి నైజాం విషయంలోనే ఇలాంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నైజాంలో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. భారీ ఎత్తున దాదాపు ముప్పై కోట్ల రూపాయల వరకూ వెచ్చించి ఈ సినిమాను కొనుగోలు చేశారట ఆయన.


అయితే.. తెలంగాణలో ఈ సినిమా జోష్ అంతగా కనిపించడం లేదు. ప్రత్యేకించి ప్రీమియర్ షోలకు ప్రభుత్వం నుంచి పరిమితులు రాకపోవడం, అలాగే అదనపు షోలకూ ఛాన్సులు లేకపోవడం, టికెట్ ధరను పెంచుకోవడానికి కూడా ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడం.. వంటి రీజన్లు అజ్ఞాతవాసి వసూళ్లపై ప్రభావం చూపిస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నైజాంలో ఈ సినిమా ఫస్ట్ డేకి ఐదున్నర కోట్ల రూపాయల మొత్తాన్ని రాబట్టిందని.. ఇంకా రాబట్టుకోవాల్సింది చాలా ఉందని.. మరోవైపు పోటీలోకి వస్తున్న ఇతర సినిమాలతో ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు టెన్షన్ మొదలవుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ట్రేడ్ పండితుల నుంచి.