తెలుగు ప్రేక్షకులకు శివ సినిమా సైకిల్ చైన్ పరిచయం చేసి ఎలా సంచలనం సృష్టించిందో తెలిసిందే. గుడుంబా శంకర్ ప్యాంటు మీద ప్యాంటు వేసుకునే స్టైల్ చూపించింది. ఇక తాజాగా పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమా కోసం ఇచ్చిన పోజు అభిమానులకు ఖచ్చితంగా నచ్చేస్తుందనటంలో సందేహం లేదు.

 

తాజాగా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాకు సంబంధించి  టీజర్ లాంచ్  తేదీని ప్రకటిస్తూ లేటెస్ట్ గా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఇచ్చిన ఫోజు చూస్తే.. దాంట్లో పవన్ సైకిల్ తొక్కుతూ కనిపిస్తాడు. అంతేకాకుండా నోట్లో బెల్టు పెట్టుకుని.. వీర లెవల్లో కుమ్మేయటానికే వస్తున్నా అన్నట్లుగా పక్కా మాస్ గా వుందా పోస్టర్ లో పవన్ లుక్.

 

ఈ లుక్ చూసిన జనం సోషల్ మీడియాలో పవన్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడని, అందుకే సైకిల్ పైనున్న లుక్ తో పోస్టర్ రిలీజ్ చేశారని... విమర్శలు వస్తున్నాయి. గతంలో మహేష్ బాబు కూడా శ్రీమంతుడు సినిమాలో సైకిల్ తొక్కినప్పుడు కూడా.. ఇదే తరహా కామెంట్స్ రావటం గమనార్హం.

 

అయితే సినిమాలో సైకిల్ వాడినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చినట్లు కాదని కొందరు వాదిస్తున్నారు. అలా అయితే.. చేయి వున్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ వాళ్లని, ఫ్యాన్ క్రింద కూర్చునే ప్రతి వాళ్లూ వై.ఎస్.ఆర్.సి.పి. వాళ్లని అంటారా ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇక అజ్ఞాతవాసి టీజర్ డిసెంబర్ 16న రిలీజ్ కానుంది.