తమ అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘అజ్ఞాతవాసి’ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు తెలంగాణ పోలీసులు షాకిచ్చారు. సంక్రాంతి కానుకగా బుధవారం (జనవరి 10న) ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీమియర్ షోలను ఈ అర్ధరాత్రి నుంచే ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి దాటిన తరవాత ఒంటి గంట నుంచి ఉదయం 8 గంటల వరకు ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించారు. అనుమతులు కూడా వచ్చాయని పవన్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగితేలుతున్నారు. 

 

అయితే తెలంగాణలో పవన్ అభిమానులకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఈరోజు అర్ధరాత్రి తరవాత ‘అజ్ఞాతవాసి’ ప్రీమియర్ షోల ప్రదర్శనకు అనుమతి నిరాకరించారు. అర్ధరాత్రి దాటిన తరవాత ప్రీమియర్ షోలు వేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పోలీసులు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది.

 

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అర్ధరాత్రి ప్రీమియర్ షోలకు ఎలాంటి ఆటంకం లేదు. అక్కడ రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 8 గంటల వరకు షోలు వేయనున్నారు. ఈ మేరకు టిక్కెట్లు కూడా ఇప్పటికే అమ్ముడైపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే తెలంగాణలో కూడా అర్ధరాత్రి ప్రీమియర్ షోలు వేయించడానికి చిత్ర యూనిట్ ఇంకా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలోని పెద్ద మనుషుల వరకు వెళ్లైనా అనుమతి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.