పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్ లో వచ్చిన అఙ్ఞాతవాసి చిత్రం పవన్ కల్యాణ్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టింది. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వెళ్లే ముందు పవన్ సెన్సేషనల్ హిట్ కొట్టాలనుకొన్న ఫ్యాన్స్ ఆశలపై త్రివిక్రమ్ నీళ్లు జల్లడంతో.. పవన్ క్రేజ్ అడ్డంగా పడిపోయి.. పరువుతోపాటు పైసలు కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతున్నదనే టాక్ బలంగా వినిపిస్తోంది.

 

తొలిరోజు రికార్డు వసూళ్లు సాధించిన సినిమా.. నెగిటివ్ టాక్ రావడంతో రెండో రోజు దారుణంగా దెబ్బతింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్లకు పైగా వసూలు చేసిన అఙ్ఞాతవాసి బాహుబలి1 ను సైతం మించిన మూవీగా రికార్డు సృష్టించింది. అయితే సినిమాపై నెగటివ్ టాక్ రావటంతో రెండో రోజు వసూళ్లు షాకిచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కలెక్షన్స్ దారుణంగా పడిపోవటం డిస్టిబ్యూటర్లను ఆందోళనలో పడేసింది.

 

అఙ్ఞాతవాసిని రిలీజ్ కు ముందే కాపీరైట్ వివాదం వెంటాడింది. దాంతో బాలీవుడ్‌లోని ఓ సంస్థకు భారీ మొత్తంలో ముట్టజెప్పాల్సిన అవసరం వచ్చింది. దాంతో దర్శకుడు త్రివిక్రమ్ తనవంతు బాధ్యతగా రూ.10 కోట్లు తిరిగి ఇవ్వడానికి సిద్దపడినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు నష్టపోయిన డిస్టిబ్యూటర్లకు పవన్ కల్యాణ్ అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని, డిస్టిబ్యూటర్లను ఆదుకోవడానికి రూ.15 కోట్లు ఇచ్చేందుకు పవర్ స్టార్ సిద్ధంగా ఉన్నారని తాజాగా వెలుగులోకి వచ్చింది.

 

రిలీజ్‌కు ముందు అఙ్ఞాతవాసి చిత్రానికి వచ్చిన క్రేజ్ ను సొమ్ము చేసుకొందామని ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. తొలి రోజు బాగానే ఉన్నా.. ప్రేక్షకులు లేని కారణంగా రెండో రోజు థియేటర్లు వెలవెలబోయాయి. దాంతో ఏపీలో స్పెషల్ షో రద్దు చేసినట్టు సమాచారం. అయితే విక్టరీ  వెంకటేష్ నటించిన సీన్స్ కలిపి సినిమాకు నష్టం కలిగిస్తున సీన్స్ కట్ చేయటంతో అజ్ఞాతవాసి వసూళ్లపై మళ్లీ ఆశలు చిగురించాయి.