భారీ అంచనాలతో విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబో మూవీ 'అజ్ఞాతవాసి' చిత్రం.. ఇపుడు రూ. 100 కోట్లు కూడా వసూలు చేసే అవకాశం లేకుండా పోయింది. ఓవరాల్ రన్ లో కూడా ఈ చిత్రం కనీసం రూ. 60 కోట్ల షేర్ కూడా సాధించడం కష్టం అంటున్నారు ట్రేడ్ పండితులు.

 

పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి' చిత్రం థియేట్రికల్ రైట్స్ రూ. 125 కోట్లకు అమ్మారు. అంటే సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా ఉండాలంటే.. 130 కోట్ల షేర్ సాధించాలి. అయితే సినిమా విడుదలై 6 రోజులైనా రూ. 52 కోట్ల షేర్ కూడా సాధించలేదు. దీంతో ఈ చిత్రం భారీ నష్టాలు మూటగట్టుకోక తప్పని పరిస్థితి నెలకొంది. సంక్రాంతి పండగ రోజు సెలవు అయినప్పటి తెలుగు రాష్ట్రాల్లో అన్నిచోట్లా కలిపి కేవలం రూ. 2.17 కోట్లు మాత్రమే వసూలు చేసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

‘అజ్ఞాతవాసి' సినిమాపై భారీగా నష్టపోయేది నైజాం డిస్ట్రిబ్యూటరే అంటున్నారు. నైజాంలో ఈ చిత్రాన్ని రూ. 25 కోట్ల పై చిలుకు ధరకు అమ్మారు. తొలి 6 రోజుల్లో ఈచిత్రం ఇక్కడ కేవలం రూ. 10 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. సంక్రాంతి పండగ సీజన్ కూడా ముగిసిన నేపథ్యంలో ఇకపై వసూళ్లు మరింత పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

 

సీడెడ్ ఏరియాలో ‘అజ్ఞాతవాసి' రైట్స్ రూ. 15 కోట్ల పై చిలుకు అమ్మారు. అయితే ఇక్కడ తొలి 6 రోజుల్లో కేవలం రూ. 4.75 కోట్లు మాత్రమే వసూలైంది. నెల్లూరు రైట్స్ రూ. 4 కోట్ల పై చిలుకు అమ్మారు. అయితే తొలి 6 రోజుల్లో ఇక్కడ రూ. 2.12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. గుంటూరు ఏరియా రైట్స్ రూ. 9 కోట్లకు అమ్మితే.. ఇక్కడ తొలి 6 రోజుల్లో రూ. 4.81 కోట్లు మాత్రమే వసూలైంది.

 

ఇక కృష్ణా ఏరియా రైట్స్ దాదాపు రూ. 7 కోట్ల వరకు అమ్మినట్లు సమాచారం. ఇక్కడ తొలి 6 రోజుల్లో రూ. 2.8 కోట్లు మాత్రమే వసూలైంది. వెస్ట్ గోదావరి ఏరియా రైట్స్ రూ. 6 కోట్ల పై చిలుకు అమ్మారు. ఇక్కడ అజ్ఞాతవాసి చిత్రం తొలి 6 రోజుల్లో రూ. 4.2 కోట్లు వసూలు చేసింది. ఇక ఈస్ట్ గోదావరి ఏరియా రైట్స్ రూ. 7 కోట్ల పైచిలుకు అమ్మారు. అయితే తొలి 6 రోజుల్లో ఇక్కడ ఈ చిత్రం రూ. 3.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఉత్తరాంధ్ర ఏరియాలో ‘అజ్ఞాతవాసి' థియేట్రికల్ రైట్స్ రూ. 11 కోట్ల పై చిలుకు అమ్మారు. అయితే తొలి రోజుల్లో ఈ చిత్రం ఇక్కడ రూ. 4.7 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

 

ఇప్పటి వరకు అజ్ఞాతవాసి చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 37 కోట్ల షేర్ (రూ. 58.20 గ్రాస్) వసూలు చేసింది. ఓవర్సీస్ తో పాటు తెలుగురాష్ట్రాలు, ఆలోవర్ ఇండియా అన్నీ కలిపితే వరల్డ్ వైడ్ ఇప్పటి వరకు రూ. 52.50 కోట్ల షేర్ (రూ.85 కోట్ల గ్రాస్) మాత్రమే వసూలైంది. ఇక పండగ సీజన్ కూడా అయిపోవడంటో అజ్ఞాతవాసికి భారీ నష్టాలు తప్పేలా లేవన్నది తేలిపోయింది.