కామెడీ కింగ్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరణించి దశాబ్దం అవుతుంది. ఆయన కుమారుడు రవి బ్రహ్మ తేజ తాజా ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు. తండ్రిని తలచుకుని ఎమోషనల్ అయ్యారు.
టాలీవుడ్ ఆల్ టైం టాప్ కమెడియన్స్ లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఒకరు. అత్యంత సహజంగా ఆయన కామెడీ ఉంటుంది. మంచి టైమింగ్ కలిగిన యాక్టర్. అనారోగ్యం కారణంగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం అకాల మరణం పొందారు. ఆయన కుమారుడు రవి బ్రహ్మ తేజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండ్రిని తలచుకుని ఎమోషనల్ అయ్యారు.
ఆయన స్టార్ కమెడియన్ అయినప్పటికీ చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని చిత్రాల్లో నటించేవారు. రెమ్యునరేషన్ డిమాండ్ చేయకుండా ఇచ్చినంత తీసుకునేవారు. ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకొని కొందరు నిర్మాతలు డబ్బులు ఎగ్గొట్టారు. అలా చేసిన నిర్మాతలు ప్రస్తుతం కష్టాలు అనుభవిస్తున్నారని రవి బ్రహ్మ తేజ చెప్పారు.
వందల చిత్రాల్లో నటించిన నాన్న మరణించాక ఆయన పార్థివ దేహం చూసేందుకు రాజేంద్రప్రసాద్, హీరో గోపీచంద్, అలీ, వేణు మాధవ్, దగ్గుబాటి రామానాయుడుతో పాటు కొందరు చిత్ర ప్రముఖులు వచ్చారు. మెగా ఫ్యామిలీ నుండి ఒక్కరు కూడా రాలేదు. రావాలని అనుకున్నారట. ఎందుకో కుదర్లేదు. నాన్న చనిపోయే ముందు మాకేమీ చెప్పలేదు. అందుకే ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్ కి తీసుకెళ్లలేదు. నేరుగా మా సొంత ఊరు తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు పూర్తి చేశాము... అని రవి బ్రహ్మ తేజ వెల్లడించారు.
ధర్మవరపు సుబ్రహ్మణ్యం లివర్ క్యాన్సర్ బారిన పడ్డారు. కొన్ని నెలలు ఆయన మంచానికే పరిమితమయ్యారు. 2013లో డిసెంబర్ 7న 59ఏళ్ల వయసులో కన్నుమూశారు. ప్రకాశం జిల్లా కొమ్మినేనివారిపాలెం ఆయన సొంతూరు. అక్కడే అంత్యక్రియలు జరిగాయి.
గవర్నమెంట్ ఉద్యోగి అయిన ధర్మవరపు దూరదర్శన్ లో 'ఆనందో బ్రహ్మ' టైటిల్ తో కామెడీ ప్రోగ్రాం చేశారు. దర్శకత్వం వహించి నటించారు. తర్వాత నటుడిగా సినిమాల్లోకి ప్రవేశించారు. నువ్వు నేను మూవీలో ధర్మవరపు పోషించిన లెక్చరర్ పాత్ర విపరీతమైన పేరు తెచ్చింది. అక్కడ నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. కన్నుమూసే వరకు వందల చిత్రాల్లో నటించారు.
