అదితి రావు హైదరి తెలుగులో సమ్మోహనం, అంతరిక్షం లాంటి చిత్రాల్లో నటించింది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికితే ఒదిగిపోయి నటించే ప్రతిభ అదితి సొంతం. అదితి రావు హైదరి బాలీవుడ్ లో కూడా నటిస్తోంది. కానీ ఆమెకు స్టార్ స్టేటస్ తీసుకువచ్చే సినిమా ఇంతవరకు పడలేదు. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం వరుస పరాజయాల్లో ఉన్నాడు. ఓ హిట్ సినిమా కోసం ప్రయత్నిస్తున్నాడు. 

రాజ్ తరుణ్ దిల్ రాజు బ్యానర్ లో నీది నాదీ ఒకే లోకం అనే చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు గుండె జారి గల్లంతయ్యిందే ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం దర్శకుడు అదితి రావు హైదరితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

అదితి ఈ చిత్రం కోసం 80 లక్షలు పారితోషికం డిమాండ్ చేస్తోందట. ప్రస్తుతం తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న పూజా హెగ్డే, రష్మిక లాంటి హీరోయిన్లే కోటికి అటు ఇటూగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. రాజ్ తరుణ్ సినిమా కోసం అదితి 80 లక్షలు డిమాండ్ చేస్తున్నా దర్శకుడు మాత్రం ఆమే కావాలని పట్టుబడుతున్నాడట. తాను రాసుకున్న కథకు అదితి అయితేనే న్యాయం చేస్తుందని నమ్ముతున్నాడట. ఈ కాంబినేషన్ ఒకే అయితే రాజ్ తరుణ్ సరసన నటించే కాస్ట్లీ హీరోయిన్ అదితినే అవుతుంది.