ఆదిపురుష్ మూవీ టీజర్ రిలీజైనప్పటి నుంచీ ఆ మూవీపై ట్రోలింగ్ మొదలైంది. సినిమా రిలీజ్ అయ్యాక అది ఊపందుకుంది.
ఆదికావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఆదిపురుష్ మూవీ నేడు (జూన్ 16) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‍గా విడుదలైంది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్.. శ్రీరాముడిగా, కృతి సనన్.. సీతాదేవిగా నటించారు. ఔం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ మూవీకి డివైడ్ టాక్ వస్తోంది. ఈ చిత్రంలో రావణుడి పాత్రను బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పోషించాడు. అయితే, ఆదిపురుష్‍లో రావణుడిగా సైఫ్ లుక్, ఆ పాత్రకు ఉపయోగించిన గ్రాఫిక్స్, వేషధారణ కొందరిని నిరాశపరుస్తోంది. రావణుడి గ్రాఫిక్స్ గురించి సోషల్ మీడియాలో చాలా మంది మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. రావణుడి పాత్రపై కామెంట్లు చేస్తున్నారు.
అదే సమయంలో ఆంజనేయుడు పాత్ర... లంకాదహనం చేసేటప్పుడు చెప్పే డైలాగు సైతం కామెడీగా ఉందని అంటున్నారు. ఆ డైలాగు ఇలా సాగుతుంది.
"గుడ్డ నీ బాబుదే
తైలం నీ బాబుదే
నిప్పు నీ బాబుదే
మరి కాలేది కూడా నీ బాబుదే"
బాలయ్య పూనాడా ఏంటి ఆ టైమ్ లో హనుమంతులు వారిని అని వెటకారం చేస్తున్నారు.

మరో ప్రక్క రావణుడి పాత్ర కోసం ఆదిపురుష్‍లో ఉపయోగించిన గ్రాఫిక్స్/వీఎఫ్‍ఎక్స్‌పై మీమ్స్ వెల్లువలా వస్తున్నాయి. ముఖ్యంగా రావణుడి పది తలలు ఒకే వరుసలో కాకుండా.. రెండు వరుసల్లో చూపించిన తీరును చాలా మంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. డబుల్ డెక్కర్ 10 హెడెడ్ లుక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సుమారు రూ.600 కోట్ల బడ్జెట్‍తో తీసిన మూవీలో రావణుడి లుక్ కోసం ఇలాంటి గ్రాఫిక్స్ వినియోగిస్తారా అంటూ చిత్రయూనిట్‍పై కొందరు ఆగ్రహిస్తున్నారు.
