ఆదిపురుష్ మూవీ కంటెంట్, పాత్రల లుక్స్ విమర్శలపాలవుతున్నాయి. నెటిజెన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ పై వివేక్ కూచిబొట్ల ఫైర్ అయ్యారు.
ఆదిపురుష్ మూవీ పంపిణీదారుగా ఉన్న వివేక్ కూచిబొట్ల ట్రోల్స్ పై అసహనం వ్యక్తం చేశారు. ఆదిపురుష్ మూవీలో రామాయణ పాత్రలు భిన్నంగా రూపొందించడాన్ని సమర్ధించుకున్నారు. ఆయన మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ మూవీ కోటి మంది చూశారు. ప్రతి గడపకు రాముడిని తీసుకెళ్లాలన్న మా ప్రయత్నం సగం సఫలీకృతం అయ్యింది. రాముడిని ప్రతి ఒక్కరూ తలచుకుంటున్నారు. ఆదిపురుష్ చిత్రాన్ని ట్రోల్ చేస్తున్నవాళ్ళు కూడా తలచుకుంటున్నారు.
ఆదిపురుష్ మూవీని గతంలో మాదిరి సంస్కృత పద్యాలు, డైలాగ్స్ తో తీయలేము. అలా చేస్తే మీరే అప్డేట్ అవ్వమని ట్రోల్ చేస్తారు. ఇప్పుడు అప్డేటెడ్ గా రామాయణం తీస్తే ట్రోల్ చేస్తున్నారు. అసలు రాముడు, రావణసురులను ఎవరూ చూడలేదు. మీ ఊహలో వారు అలా ఉంటే మా ఊహలో ఇలా ఉన్నారు. ఈ జనరేషన్ పిల్లలకు థోర్, బ్యాట్ మాన్, స్పైడర్ మాన్, డిస్నీ హీరోలు తెలుసు. కానీ రామాయణంలోని పాత్రల గురించి తెలియదు. అందుకే చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా సినిమా తీశాము.
చిన్న పిల్లలు చిత్రాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ప్రతిరోజూ రికార్డు వసూళ్లు నమోదు అవుతున్నాయి, అని వివేక్ కూచిబొట్ల చెప్పుకొచ్చారు. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆదిపురుష్ జూన్ 16న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ప్రభాస్ రాఘవుడిగా, జానకి పాత్రలో కృతి సనన్ నటించింది. లంకేశ్వరుడు పాత్ర సైఫ్ అలీ ఖాన్ చేశాడు. టి సిరీస్ బ్యానర్లో భూషణ్ కుమార్ నిర్మించారు. అజయ్-అతుల్ సంగీతం అందించారు. వరల్డ్ వైడ్ మూడు రోజులకు ఆదిపురుష్ రూ. 340 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించారు.
