కేరళలో కొన్నేళ్లుగా ‘32 వేల మంది’ మహిళలు అదృశ్యమయ్యారని, వారంతా ఇస్లాం మతంలోకి మారి తీవ్రవాద కార్యకలాపాల కోసం పని చేస్తున్నారన్న కథతో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ సమయంలోనే పెద్ద వివాదం మొదలైంది.
గత కొద్ది రోజులుగా రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిన్న అనగా శుక్రవారం విడుదలైంది. ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పోస్టర్స్, ట్రైలర్ తోనే వివాదం రాజేసింది. బలవంత మతమార్పిడికి గురై, ఐసిస్‌లో చేరిన కొందరు మహిళలే ఈ సినిమా ఇతివృత్తం. వారం క్రితం సినిమా ట్రయిలర్ రిలీజ్ నాటి నుంచే వివాదం రేగుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్న ఈ సినిమాపై నిషేధం విధించాలంటూ కేరళ, తమిళనాడుల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు కూడా జరిగాయి. కర్ణాటకలోని బళ్లారి ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ సైతం ఈ సినిమా గురించి ప్రస్తావించడం విశేషం.
చిత్రం కలెక్షన్స్ విషయానికి వస్తే..అందరూ ఊహించినట్టుగానే ఈ చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్స్ లభించాయి. మొదటి రోజు దేశవ్యాప్తంగా ఏడున్నర కోట్లు సాధించినట్టు తెలుస్తోంది. ఈ కలెక్షన్స్ అంచనా మాత్రమే అని, వాస్తవ వసూళ్లు ఇంకా ఎక్కువగా ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. వీకెండ్ లో కలెక్షన్లు ఇంకా పెరగొచ్చని అంటున్నాయి. చిన్న బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం కశ్మీర్ ఫైల్స్ మాదిరిగా భారీ విజయం సొంతం చేసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కశ్మీర్ ఫైల్స్ చిత్రం తొలి రోజు రూ. 3.55 కోట్లు మాత్రమే రాబట్టింది. కానీ, తర్వాత రోజు రోజుకు కలెక్షన్లు పెరిగాయి.
లవ్ జిహాద్ పేరిట కేరళలో 32 వేల మందికిపైకా అమాయక యువతులను ట్రాప్ చేసి ఐసిస్ లో చేర్చారని చెబుతూ తీసిన ఈ చిత్రంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సినిమాను నిషేధించాలంటూ సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. కాంగ్రెస్, వామపక్షాలు ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కానీ, సినిమా విడుదలను అపేందుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు. ‘ది కేరళ స్టోరీ’లో కొన్ని అంశాలను చిత్రంలో తప్పుగా చిత్రీకరించారని, కేరళ ప్రతిష్టకు దెబ్బతీసేలా ఉన్నందున విడుదలను అడ్డుకోవాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ‘సన్యాసులు, క్రిస్టియన్ పూజారులు, ఇతరులను కూడా చెడ్డవారిగా చూపించిన ఘటనలు సినిమాల్లో అనేకం ఉన్నాయి. కొందరు మతబోధకులను చెడుగా చూపారనే కారణంతో సినిమాను నిషేధించలేం’అని పేర్కొంది.
