నటి విజయలక్ష్మి ఈ నెల 29న కోర్టులో హాజరుకావాల్సిందేనన్న హైకోర్టు.. వివరాలు ఇవే..
నటి విజయలక్ష్మిని ఈ నెల 29న కోర్టులో హాజరుకావాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది.

చెన్నై: నటి విజయలక్ష్మికి మద్రాసు హైకోర్టులో షాక్ తగిలింది. ఈ నెల 29న కోర్టులో హాజరుకావాలని నటి విజయలక్ష్మిని హైకోర్టు ఆదేశించింది. వివరాలు.. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్‌పై నటి విజయలక్ష్మి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. పెళ్లి చేసుకుంటానని మోసగించాడని ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు పాల్పడ్డారని కూడా ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి 2011లో వలసరవాక్కం పోలీస్ స్టేషన్‌లో సీమాన్‌పై ఫిర్యాదు చేశారు.
అయితే ఆ తర్వాత 2012లో ఆమె తన ఫిర్యాదును ఉపసంహరించుకుంది. అయితే ఇటీవల తన ఫిర్యాదును రీ ఓపెన్ చేయాలని కూడా విజయలక్ష్మి పోలీసు ఉన్నతాధికారులను కోరినట్టుగా తెలుస్తోంది. అయితే మరోవైపు విజయలక్ష్మి ఫిర్యాదును ఉపసంహరించుకున్నప్పటికీ.. పోలీసులు కేసును క్లోజ్ చేయలేదని సీమాన్ తెలిపారు. విజయలక్ష్మి ఫిర్యాదును ఉపసంహరించుకోవడంతో.. 10 సంవత్సరాల క్రితం నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని సీమాన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి తనపై పెండింగ్‌లో ఉన్న ఎఫ్‌ఐఆర్ , అన్ని ఇతర చర్యలను రద్దు చేయాలని కోరారు.
అయితే సెప్టెంబర్ 20న ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కేసు స్థితిపై పోలీసుల నుండి సూచనలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించింది. ఈ క్రమంలోనే మరోమారు మంగళవారం ఈ పిటిషన్ హైకోర్టులో విచారణకు రాగా.. ప్రాసిక్యూషన్ స్టేటస్ రిపోర్టును దాఖలు చేసింది. ఈ విషయాన్ని పరిశీలించిన హైకోర్టు.. విజయలక్ష్మిని సెప్టెంబర్ 29న హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేశారు.