మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ షాకింగ్ పోస్ట్ చేశారు. ఆమె హార్ట్ అటాక్ కి గురైనట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం ఒక్కసారిగా కలకలం రేపింది.

నటి సుస్మితాసేన్ సడన్ షాక్ ఇచ్చారు. తనకు హార్ట్ అటాక్ వచ్చినట్లు చెప్పి కలకలం రేపారు. సుస్మితాసేన్ ఇంస్టాగ్రామ్ లో... 'కొద్ది రోజుల క్రితం నేను గుండెపోటుకి గురయ్యాను. వైద్యులు యాంజియోప్లాస్టీ చేశాను. అలాగే గుండె లోపల స్టెంట్ అమర్చాను. నాకు వైద్యం అందించిన కార్డియాలజిస్ట్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. సమయానికి స్పందించి ఈ ప్రమాదం నుండి నేను బయటపడేలా చేసిన చాలా మందికి కృతజ్ఞతలు చెప్పాలి. మరో పోస్ట్ లో అన్ని విషయాలు వివరిస్తాను. వారందరికీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఈ పోస్ట్ పెట్టడానికి కారణం... నా శ్రేయోభిలాషులకు అభిమానులకు నేను క్షేమంగానే ఉన్నానని చెప్పాలనుకున్నాను. ఇప్పుడు నాకేం పర్లేదు. గతంలో మాదిరి నేను సాధారణ జీవితం గడపవచ్చు. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు' అని కామెంట్ చేశారు. 

సుస్మితాసేన్ అనారోగ్యం బారినపడ్డారని ఎలాంటి సమాచారం లేదు. మీడియాలో, చిత్ర వర్గాల్లో దీనిపై చర్చ జరగలేదు. ఆమె సడన్ గా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో అందరూ షాక్ కి గురవుతున్నారు. అభిమానులు ఆమెకు ఏం కాకూడదని కోరుకుంటున్నారు. హార్ట్ అటాక్ నుండి క్షేమంగా బయటపడినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

View post on Instagram

47 ఏళ్ల సుస్మితాసేన్ చాలా కాలం మోడల్ రోహ్మన్ షాల్ తో డేటింగ్ చేశారు. సోషల్ మీడియా ద్వారా వీరి రిలేషన్ కి బీజం పడింది. ఇంస్టాగ్రామ్ లో రొహ్మన్ షాల్ సుస్మితా సేన్ కి డైరెక్ట్ మెసేజ్ చేశారట. సింగిల్ గా ఉన్న సుస్మితా సేన్ రోహ్మన్ సందేశానికి స్పందించారట. అలా వారి బంధం మొదలైంది. సుస్మితా సేన్ కంటే రోహ్మన్ 15 ఏళ్లు చిన్నవాడు. కాగా 2021లో సుస్మితా, రోహ్మన్ మధ్య విబేధాలు తలెత్తాయి. దాంతో బ్రేకప్ చెప్పుకున్నారు. 2022 జులై నెలలో ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీతో రిలేషన్ పెట్టుకున్నట్లు సుస్మిత వెల్లడించారు. ఆయనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు విడుదల చేశారు.

 మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన సుస్మితాసేన్ 1994లో మిస్ యూనివర్స్ టైటిల్ అందుకున్నారు. సుస్మితాసేన్ వివాహం చేసుకోలేదు. ఆమె ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకున్నారు. 2000 సంవత్సరంలో రీనీ, 2010 లో అలీషా అనే చిన్నారిని ఆమె అడాప్ట్ చేసుకున్నారు. 1996లో విడుదలైన దస్తక్ మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు. తెలుగులో ఆమె నాగార్జునకు జంటగా రక్షకుడు మూవీలో నటించారు. ప్రస్తుతం సుస్మితాసేన్ వెబ్ సిరీస్లు చేస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఆర్య, ఆర్య 2 సిరీస్లలో సుస్మితా లీడ్ రోల్ చేశారు.