క్యారెక్టర్‌ ఆర్టిస్టు సురేఖ వాణి మరోసారి పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు ఇటీవల సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. సింగర్‌ సునీత స్పూర్తితో తాను కూడా రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో తాజాగా సురేఖ వాణి స్పందించింది. ఆ వార్తలను ఖండించింది. 

మరోసారి మ్యారేజ్‌ చేసుకునే ఆలోచన తనకు లేదని స్పష్టం చేసింది. తాను రెండో పెళ్లి చేసుకోబోతుందన్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ అవాస్తవాలని తెలిపింది. పుకార్లని నమ్మవద్దని వెల్లడించింది. యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన సురేఖ వాణి నటిగా మారి అనేక తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మెప్పించింది. ముఖ్యంగా బ్రహ్మానందం కాంబినేషన్‌లో, ఫ్యామిలీ డ్రామా సన్నివేశాల్లో సురేఖ తనదైన నటనతో, కామెడీతో ఆకట్టుకుంటుంది. `భద్ర`, `దుబాయ్‌ శీను`, `బృందావనం`, `శ్రీమంతుడు`, `బొమ్మరిల్లు`, `సరైనోడు` వంటి చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చే పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.

గత రెండేళ్ల క్రితం సురేఖ వాణి భర్త అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటోంది. తనకి కూతురు సుప్రీత ఉన్నారు. వీరిద్దరు కలిసి ఇటీవల బాగా ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకుని వార్తల్లో నిలిచారు. చర్చనీయాంశంగా మారారు. అయితే సునీత తన పిల్లలు అనుమతితో రామ్‌ వీరపనేని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే తన కూతురు సుప్రీత అంగీకారంతో సురేఖ వాణి కూడా మ్యారేజ్‌ చేసుకుంటుందని వార్తలు వినిపించాయి.