నాలుగు దశాబ్దాలకుపైగా సినీ ప్రేక్షక లోకాన్ని తన అందంతో సమ్మోహితం చేసి గ్లామర్ క్వీన్ శ్రీదేవి ఇక లేరు. శనివారం రాత్రి గుండెపోటుతో దుబాయ్‌లో ఆమె మరణించారు. బాలీవుడ్ నటుడు మొహిత్ మార్వా వివాహం నిమిత్తం భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషి కపూర్‌తో కలిసి శ్రీదేవి దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మృతితో సినీలోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఇప్పటికే శ్రీదేవి ఇంటికి వారి ఫ్యామిలీ సన్నిహితులు, సినీరంగ ప్రముఖులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.తల్లి మరణవార్త వినగానే పెద్ద కూతురు జాన్వీ కూడా షూటింగ్ నుండి వెళ్ళిపోయినట్లుగా సమాచారం. శ్రీదేవి మరణించారనే వార్తని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దడక్ చిత్ర షూటింగ్ కారణంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఈ పెళ్ళికి వెళ్లలేదని సమాచారం.బాలీవుడ్‌లో ఫిమేల్ సూపర్ స్టార్‌గా పేరొందిన శ్రీదేవి 13 ఆగస్టు 1963వ తేదీన జన్మించారు. ఆమె అసలు పేరు అమ్మయ్యంగార్‌ అయ్యప్పన్‌. 1996లో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో శ్రీదేవి వివాహం జరిగింది. ఈ జంటకు జాన్వీ, ఖుషీ అనే ఇద్దరు కుమార్తెలున్నారు.బాలనటిగా కందన్ కరుణ్ సినిమాతో 1967లో సినిమాల్లోకి అరంగేట్రం చేసిన శ్రీదేవి.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. తెలుగులో పదహారేళ్ళ వయసు సినిమాతో హీరోయిన్‌గా అలరించారు.ఇప్పటి వరకూ 15 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు పొందిన శ్రీదేవిని 2013లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది.ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రంతో రెండో ఇన్నింగ్స్‌ను విజయవంతంగా ప్రారంభించిన శ్రీదేవి, ఆ తరువాత తమిళంలో పులి చిత్రంలోను, చిట్టచివరిగా 2017లో మామ్ సినిమాలోను నటించారు.

ఆమె తండ్రి పేరు అయ్యప్పన్, ఆయన ఒక న్యాయవాది. తల్లి పేరు రాజేశ్వరి. శ్రీదేవికి శ్రీలత అను ఒక సోదరి, సతీష్ అను సోదరుడు ఉన్నారు. ఆమె తండ్రి లమ్హె అను చిత్రం నిర్మాణంలో ఉండగా, తల్లి జుదాయి అను చిత్రం నిర్మాణంలో ఉండగా మరణించారు. హిందు సాంప్రదాయం ప్రకారం పెద్ద కుమారుడు తల్లి చితికి నిప్పు అంటించాలి. కాని శ్రీదేవి కూతురు అయినప్పటికి, తన తల్లి అంత్య క్రియలకు తానే చితికి నిప్పు అంటించింది.
మిథన్‌తో అఫైర్.. పెళ్లి కొన్ని కథనాలు శ్రీదేవి కొంతకాలం బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తితో సహజీవనం చేసింది. వారిద్దరకూ రహస్యంగా వివాహం చేసుకొన్నారు, అతడు తన మొదటి భార్య అయిన గీతాబాలికి విడాకులు ఇవ్వని కారణంగా అతడికి దూరమయింది అని సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది.అయితే మిథున్‌తో పెళ్లి ఎంతవరకూ నిజం అనేదానికి తగిన ఆధారాలు మాత్రం లేవు. తర్వాత కాలంలో ఆమె హిందీ సినీ నిర్మాత, ఆమెతో కలసి ఎన్నో సినిమాలలో నటించిన హీరో అనిల్ కపూర్ సోదరుడు అయిన బోనీకపూర్‌ను 1996 జూన్ 2న వివాహం చేసుకొన్నరు.

అందంతో ఆకట్టుకొంటూ శ్రీదేవి అనతికాలంలోనే అగ్ర కథానాయిక అని పేరు తెచ్చుకొన్నది. తన నటనా జీవితాన్ని బాలనటిగా కన్దన్ కరుణాయ్ (1967) అనే తమిళ చిత్రంతో మొదలు పెట్టిన అంచెలంచెలుగా ఎదిగింది. తొలుత తమిళ, మలయాళ చిత్రాలలో నటించారు. ఆ తర్వాత తెలుగులోకి ప్రవేశించారు. తెలుగు సినీ రంగాన్ని దాదాపు నాలుగు దశాబ్దాలకుపైగా శాసించారు.
మలయాళ చిత్రపరిశ్రమలో డైరెక్టర్ ఐవీ శశి దర్శకత్వంలోనే ఎక్కువగా నటించారు. ఆమె నటించిన ఆద్యపాదం, ఆలింగనము, కుట్టవుమ్ శిక్షయుమ్, ఆ నిమషం అనే చిత్రాలు ఆదరణ పొందాయి.

1976 లో బాలచందర్ చిత్రం "మూండ్రు ముదచ్చు"లో కమల్ హాసన్, రజనీ కాంత్ లతో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా కోణాలలో నుంచి పరిశీలిస్తే ఆ చిత్రం తమిళ చలన చిత్ర సీమకి పెద్ద గుర్తింపు తెచ్చింది. ఏదేమైన ఆమె మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు.