నటి శ్రీసుధ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్‌పై తన కారు యాక్సిడెంట్‌ ఘటనపై ఆమె విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. తనది యాక్సిడెంట్‌ కాదని, కొందరు దుండగులు కావాలనే తనపై హత్యాయత్నానికి పాల్పడ్డట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ ఫిర్యాదులో తనకు సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కె నాయుడిపై అనుమానం ఉందని ఆమె వెల్లడించారు. శ్యామ్‌ కె నాయుడు తనని పెళ్లి చేసుకుంటానని ఐదేళ్లపాటు సహజీవనం చేశాడని, ఆ తర్వాత మోసం చేశాడని ఆమె గతంలో హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన విషయంతెలిసిందే. 

అయితే ఈకేసుని ఉపసంహరించుకోవాలని ఆయన బెదిరింపులకు దిగుతున్నాడని, తనకు అతని నుంచి ప్రాణ హాని ఉందని ఆమె ఆ మధ్య మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ కేసుకి, విజయవాడ ఘటనకి సంబంధం ఉందని ఆమె విజయవాడలోని వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. తనని హత్య చేసే క్రమంలోనే యాక్సిడెంట్‌ చేయించి ఉంటాడని, తనకు శ్యామ్‌ కె నాయుడిపై అనుమానం ఉందని తెలిపింది. 

శ్యామ్‌ కె నాయుడుపై హైదరాబాద్‌లో పెట్టిన కేసు దర్యాప్తు కోసం ఎస్‌ఆర్‌ నగర్‌ సీఐ మురళీకృష్ణ తన దగ్గర డబ్బులు వసూలు చేశారని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా ఈ కేసులో నిందితుడు, తనతో రాజీ కుదుర్చుకున్నట్టు నకిలీ పత్రాలు సృష్టించారని ఆరోపించింది. అంతేకాదు నాంపల్లిలోని ఏసీబీ అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది శ్రీసుధ. ఇప్పుడు ఆమె యాక్సిడెంట్‌కి గురి కావడం పలు అనుమానాలకు తావిస్తుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు. ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.